
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలో అత్యధికులు సందర్శించే కట్టడంలో ఈఫిల్ టవర్ ఒకటి. పూర్తి ఇనుముతో నిర్మించిన ఏకైక కట్టడమూ ఇదే. ప్యారిస్‌లోని ఈ ఈఫిల్ టవర్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నది. దీనికి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా, అంతే ఆసక్తికరమైన ఓ పరిణామం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఆ ఈఫిల్ టవర్ ఆరు మీటర్ల ఎత్తు పెరిగింది. ఎలా పెరిగిందనే కదా మీరు ఆలోచిస్తున్నది.
ఈ ప్యారిస్ కట్టడానికి అగ్రభాగాన ఆరు మీటర్ల కొత్త డిజిటల్ రేడియో యాంటెన్నాను ఏర్పాటు చేశారు. దీంతో ఆ టవర్ ఎత్తు మరో ఆరు మీటర్లు పెరిగినట్టు అయింది. హెలికాప్టర్ ద్వారా ఆరు మీటర్ల (19.69 ఫీట్లు) ఎత్తు ఉన్న ఆ యాంటెన్నాను హెలికాప్టర్ సహాయంతో ఈఫిల్ టవర్ పైనకు తీసుకు వెళ్లారు. ఆ టవర్ చుట్టూ హెలికాప్టర్ చక్కర్లు కొట్టి ఎట్టకేలకు ఆ యాంటెన్నాను దాని అగ్ర శిఖకు తీసుకెళ్లగలిగింది. అక్కడ ఆ యాంటెన్నాను బిగించడానికి సిద్దంగా నిపుణులు ఉన్నారు. హెలికాప్టర్ ఆ యాంటెన్నాను ఈఫిల్ టవర్ అగ్రభాగానికి తీసుకెళ్లగానే అక్కడ టెక్నిషియన్లు ఈఫిల్ టవర్‌కు దాన్ని బిగించారు. ఈ యావత్ ప్రక్రియను రాయిటర్స్ మీడియా సంస్థ రికార్డు చేసింది. దాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఈఫిల్ టవర్‌ను ఇలా బ్రాడ్‌కాస్ట్ ట్రాన్స్‌మిషన్ కోసం వందేళ్లకు పైగా వినియోగించుకుంటున్నారు. ఈ టవర్ హెయిట్‌ను వారు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ బిగించిన యాంటెన్నాలను కాలం చెల్లిపోతుంటే.. మళ్లీ కొత్తవి బిగిస్తూ ఉంటారు.
ఈఫిల్ టవర్‌ను గుస్తావె ఈఫిల్ 19వ శతాబ్దం ద్వితీయార్థంలో నిర్మించారు. ఇప్పుడు కొత్త చేరికతో అంటే డిజిటల్ ఆడియో యాంటెన్నా చేర్పుతో ఈ టవర్ ఎత్తు 330 మీటర్లకు చేరింది. ఈ టవర్ నిర్మించినప్పుడు ఇదే అతి ఎత్తైన కట్టడం. అప్పటి వరకు వాషింగ్టన్‌లో ఉన్న అతి ఎత్తైన కట్టడాన్ని ఇది బీట్ చేసింది. ఈ రికార్డు తన పేరిట కొన్ని దశాబ్దాలు ఉన్నది. న్యూయార్క్‌లో క్రిస్లర్ బిల్డింగ్ నిర్మించే వరకు ఈ రికార్డు ఈఫిల్ టవర్‌కు ఉండేది. ఈ టవర్‌ను 1929లో నిర్మించారు. ఆ తర్వాత ఈ రికార్డు తరుచూ మారుతూ వస్తున్నది.