
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుంటే, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తలపడుతున్నారు. ఎక్కడో కాదు.. ట్విట్టర్‌లో. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నిన్న సవాల్ విసిరారు. తనతో సింగిల్‌గా ఫైట్ చేస్తావా? అంటూ చాలెంజ్ చేశారు. గెలిచినవారికి ఉక్రెయిన్ దక్కుతుందని ట్వీట్ చేశారు. వ్లాదిమిర్ పుతిన్ పేరును తన ట్వీట్‌లో రష్యన్ లాంగ్వేజ్‌లో రాశారు. ఉక్రెయిన్‌నూ రష్యన్ లాంగ్వేజ్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ తర్వాత మరోటి చేసి అందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ట్యాగ్ చేశారు. తన సవాల్‌ను అంగీకరిస్తున్నారా? అంటూ పుతిన్‌ను ట్యాగ్ చేశారు. తనతో నేరుగా ఫైట్ చేస్తావా? అంటూ సవాల్ విసరడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దానికి రష్యా కూడా స్పందించింది. ఇప్పుడు ఆ స్పందనకు ఎలన్ మస్క్ మరోసారి ఘాటుగా రియాక్షన్ ఇచ్చారు.
పుతిన్‌ను సింగిల్ ఫైట్‌కు రమ్మని ఎలన్ మస్క్ సవాల్ చేస్తూ ట్వీట్ చేయగా.. దానికి రష్యా స్పేస్ హెడ్ రాస్కోస్మాస్ డైరెక్టర్ జనరల్ దిమిత్రి రొగొజిన్ స్పందించారు. ఎలన్ మస్క్‌ను పిల్ల దెయ్యం(లిటిల్ డెవిల్) అంటూ పిలిచారు. రష్యన్ రైటర్ అలెగ్జాండర్ ఎస్ పుష్కిన్ రాసిన ‘ది టేల్ ఆఫ్ ది పోప్ అండ్ ఆఫ్ హిజ్ వర్క్‌మన్ బాల్డా’ అనే పోయెమ్‌ను ఉల్లేఖిస్తూ ట్వీట్ చేశారు. ఈ పోయెమ్ బద్ధకస్తుడైన పురోహితుడు.. అతడి అమాయక పనిమనిషి గురించి ఉంటుంది. ఓ బద్ధకస్తుడైన పురోహితుడు ఓ అమాయకుడిని పని మనిషిగా పెట్టుకుంటాడు. కానీ, చివరకు ఆ పని మనిషి తెలివితేటలు చూపించి ఆ పురోహితుడికే చుక్కలు చూపిస్తాడు.
ఎలన్ మస్క్‌కు కౌంటర్ ఇస్తూ.. దిమిత్ర రొగొజిన్ ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘పిల్ల దెయ్యం.. నువ్వింకా చాలా చిన్నవాడివి. నాతో పోటీ పడలేవు. నువ్వు చాలా వీక్. కాబట్టి, అది సమయాన్ని వృథా చేయడమే. నా కంటే ముందు నా సోదరుడిని ఎదుర్కో’ అని రాసుకొచ్చారు. అయితే, ఆ వార్ ఇంతటితో ముగియలేదు. ఎలన్ మస్క్ మరోసారి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
‘నువ్వు డీల్ చేయడంలో చాలా క్లిష్టమైనవాడిగా అనిపిస్తున్నావు. వ్యూ మనీలో నీవు 10 శాతం ఎక్కువగా తీసుకోవచ్చు’ అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌కు ఆయన వ్లాదిమిర్ పుతిన్ ఫేక్ ఫొటో, ఆయన ఫొటోనూ రెండూ జత చేసిన పిక్‌నూ పోస్టు చేశారు. పుతిన్ ఓ ఎలుగుబంటిపై కూర్చున్నట్టుగా ఆ ట్వీట్ ఉన్నది. దాని వెంటనే మరో ట్వీట్ కూడా చేశారు. అవసరం అయితే.. పుతిన్ తన ఎలుగుబంటినీ వెంట తెచ్చుకోవచ్చని ట్వీట్ చేశారు.