మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. 550 పాజిటివ్ కేసులు నమోదైన సమయంలో 21 రోజుల లాక్ డౌన్ ను విధించారు.
ఈ 21 రోజుల్లో కేసులు మరింతగా పెరిగిపోయాయి. లాక్ డౌన్ విధించడం వలన కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఉందని ప్రధాని మోడీ తెలిపారు. మిగతా దేశాల కంటే మనం 20 నుంచి 30శాతం తక్కువగా ఉన్నాయని, మనం సేఫ్ జోన్ లో ఉన్నామని మోడీ తెలిపారు.
అయితే, ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడం కుదరని పని అని చెప్పిన మోడీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 వ తేదీ వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని మోడీ తెలిపారు.
భారత్ సంగతి పక్కన పెడితే.. ఫ్రాన్స్ లో మాత్రం మే 11 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్ దేశం ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు మే 11 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
ఆ తర్వాత దశల వారీగా విద్యా, వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడతామని వెల్లడించింది. అదే విధంగా జూలై ద్వితీయార్థం వరకు బహిరంగ కార్యక్రమాలకు అనుమతినివ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
‘‘కరోనా నెమ్మదిస్తుందని భావిస్తున్నాం. ఆశలు చిగురిస్తాయి. మే 11 తర్వాత కొత్త దశ ప్రారంభమవుతుంది. ఫలితాలను అంచనా వేస్తూ క్రమక్రమంగా లాక్‌డౌన్ ఎత్తివేయాలనుకుంటున్నాం’’అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.