వాషింగ్టన్ డీసీ : అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్ర స్థాయిలో ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్యంపై విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ వ్యాధి ఆయన ఎముకలకు వ్యాపించింది. మూత్ర సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయని ఇటీవల ఆయన ఫిర్యాదు చేయగా, వైద్యులు స్కానింగ్ చేసి ప్రోస్టేట్‌లో నోడ్యూల్ గుర్తించారు. టెస్టుల అనంతరం వచ్చిన రిపోర్టుల్లో ఇది గ్లీసన్ స్కోర్ 9తో ఉన్న అధిక ప్రమాదకర క్యాన్సర్ అని తేలింది. ఇది సాధారణంగా శరీరంలో మరిన్ని భాగాలకు విస్తరించే అవకాశముంటుంది.
అయితే శుభవార్త ఏంటంటే, ఈ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపించింది. అంటే హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా అదుపులో పెట్టగలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 81 ఏళ్ల బిడెన్, ఆయన కుటుంబ సభ్యులు వైద్యులతో కలిసి మెరుగైన చికిత్స ఎంపికపై చర్చిస్తున్నారు.ఇదిలా ఉండగా, మే 20న విడుదల కానున్న ఓ పుస్తకంలో బిడెన్ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆయన బృందంలోని సభ్యులు గతంలోనే ఆయన శారీరక స్థితి బాగాలేదని గమనించారని, అయితే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ విషయాన్ని బయటపెట్టలేదని అందులో పేర్కొన్నారు. ప్రత్యేకించి రెండోసారి ఎన్నికల బరిలో నిలవాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా అంతర్గతంగా చర్చలు జరిగాయని పుస్తకంలో వివరించారు.
బిడెన్ నడకకు ఇబ్బంది పడుతున్న సమయంలో, ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఎయిర్ ఫోర్స్ వన్‌లో చిన్న మెట్లు ఏర్పాటు చేయడం, హ్యాండ్‌రెయిల్లు వాడటం వంటి మార్గాల్లో ఆయనకు సాయం చేశారు. కానీ గతేడాది ట్రంప్‌తో జరిగిన చర్చలో బిడెన్ ప్రదర్శన మరీ బలహీనంగా కనిపించిందని, దీనివల్ల ఆ తరవాత జరిగిన సంఘటనలే ఆయన పోటీ నుంచి తప్పుకోవడానికి కారణమయ్యాయని ఆ పుస్తక రచయితలు చెబుతున్నారు.