ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఆ దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు: డబ్ల్యూటీవో హెచ్చరిక

Published : Mar 27, 2022, 07:24 PM IST
ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఆ దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు: డబ్ల్యూటీవో హెచ్చరిక

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రభావం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాబోదు. దాని వల్ల పరోక్షంగా పేద దేశాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ప్రపంచ వాణిజ్య సంస్థ పేర్కొంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే.. పేద దేశాలపై ఈ ఏడాది ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, వచ్చే ఏడాది ఆహారం కోసం ఏకంగా అల్లర్లు జరిగే ముప్పు ఉన్నదని హెచ్చరించింది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా పరోక్ష పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది. ఇది ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా పేద దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు జరిగే అవకాశాలు ఎక్కువ అని వివరించింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవిలా ఈ విషయాలను వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పేద దేశాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలపై ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే ఈ దేశాలు ఆహార సరఫరాల కోసం నల్ల సముద్ర దేశాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.

‘మనం ఈ విషయంలో చాలా ఆందోళన చెందాల్సిందే. ఈ ఏడాది ఆహార ధరలు, ఆకలి కేకలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా తేడాతో పెరిగిపోయే అవకాశం ఉన్నది. ఆహారం, ఇంధనం అత్యావశ్యకాలు. పేద దేశాల్లోని ప్రజలకు ఇవి రెండు చాలా అవసరమైనవి. ఈ యుద్ధం వల్ల పేద దేశాల్లోని పేదలు అత్యధికంగా నష్టపోతారు’ అని వివరించారు.

35 ఆఫ్రికా దేశాలు బ్లాక్ సీ రీజియన్ నుంచి ఆహార అవసరాలను దిగుమతి చేసుకుంటున్నాయని ఆమె తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గోధుమల ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ దేశాల వాటా 24 శాతం ఉన్నది. అంటే.. ఆఫ్రికన్ దేశాలకు ఈ దేశాల నుంచి పెద్ద మొత్తంలోనే గోధుమలు దిగుమతి అవుతాయని అర్థం అవుతున్నదని ఆమె చెప్పారు.

కరోనా మహమ్మారి పరాకాష్టలో ఉన్నప్పుడు ధనిక దేశాలు టీకాలను పేద దేశాలకు పంపకుండా నిల్వ చేసుకున్నాయి. పేద దేశ ప్రజల ప్రాణాలు గాలిలో దీపంగా మిగిలాయి. కానీ, ఇప్పుడు కూడా అంటే.. ఈ యుద్ధ సమయంలోనూ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలు వాటి ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని, ముందుజాగ్రత్తగా నిల్వ చేసుకుంటామని భావిస్తే.. పేద దేశాల్లో మళ్లీ ఆహారం కోసం అల్లర్లు జరిగే ముప్పు ఉన్నదని తెలిపారు.

వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కోసం సగం మేరకు గోధుమలను ఒక్క ఉక్రెయిన్ దేశమే అందిస్తున్నదని, కానీ, ఈ యుద్ధం కారణంగా ఆ లోటు బీభత్సంగా ఉంటుందని వివరించారు. ఈ ప్రోగ్రామ్ కింద సేకరించిన ధాన్యాన్ని పేద దేశాల్లో, అవసరమైన చోట్ల పంపిణీ చేస్తారు. కానీ, ఈ సారి ఈ సౌలభ్యం కూడా దెబ్బతినిపోనుందని ఆమె పేర్కొన్నారు. 2000వ సంవత్సరంలో పేద దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు జరిగాయని, ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు పెడితే ఈ ముప్పు మళ్లీ తలెత్తుతుందని ఆమె వివరించారు. ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాది పరిణామాలు ఘోరంగా ఉంటాయని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే