‘‘విని రాసే పరీక్ష’’... విద్యార్థుల కోసం దేశంలో విమానాల రద్దు

By sivanagaprasad kodatiFirst Published Nov 15, 2018, 12:11 PM IST
Highlights

మనదేశం సంగతి పక్కనబెడితే... కొన్నిదేశాల్లో విద్యకు, విద్యార్థులకు అక్కడి ప్రభుత్వాలు అత్యంత ప్రముఖ స్థానాన్ని ఇస్తాయి.. మెరుగైన సదుపాయాలు, స్కాలర్‌షిప్‌ వంటి వసతులు కల్పించి నాణ్యమైన విద్యను తమ యువతకు అందిస్తుంటాయి

మనదేశం సంగతి పక్కనబెడితే... కొన్నిదేశాల్లో విద్యకు, విద్యార్థులకు అక్కడి ప్రభుత్వాలు అత్యంత ప్రముఖ స్థానాన్ని ఇస్తాయి.. మెరుగైన సదుపాయాలు, స్కాలర్‌షిప్‌ వంటి వసతులు కల్పించి నాణ్యమైన విద్యను తమ యువతకు అందిస్తుంటాయి.

ఈ క్రమంలో వారు పరీక్ష రాయడం కోసం దేశవ్యాప్తంగా విమానాలనే రద్దు చేసింది దక్షిణ కొరియా ప్రభుత్వం. ఆ దేశంలో ఇవాళ జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష జరుగుతోంది.. ఇది అక్కడి విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైనది..

ఉన్నత విద్య, మంచి ఉద్యోగావకాశాల కోసం ఈ విశ్వవిద్యాలయంలో చదివేందుకు యువత పోటీ పడతారు..దీనిలో భాగంగా ఈసారి దాదాపు 6 లక్షల మంది ఈ పరీక్షను రాస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల కోసం దక్షిణ కొరియా ప్రభుత్వం అసాధారణ ఏర్పాట్లు చేసింది.

ట్రాఫిక్ కారణంగా విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, స్టాక్ మార్కెట్లను గంట ఆలస్యంగా తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విద్యార్థి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే వారిని పోలీస్ వాహనంలో పరీక్షా కేంద్రానికి తరలించాలని స్పష్టం చేసింది.

ఇంగ్లీష్ లిజనింగ్ టెస్ట్ జరిగే 25 నిమిషాల పాటు పరిసర ప్రాంతాల్లో నిశ్శబ్ధ వాతావరణం ఉండేందుకు గాను... దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేయనున్నారు... ఇందుకోసం 134 విమానాల షెడ్యూల్‌ను మార్చినట్లు దక్షిణ కొరియా రవాణా శాఖ తెలిపింది.

గురువారం ఉదయం 8.40కి ప్రారంభమయ్యే పరీక్ష తొమ్మిది గంటల పాటు జరుగుతుంది. జాతీయ విశ్వవిద్యాలయ పరీక్ష సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ విద్యార్ధులకు గుడ్ లక్ తెలిపారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఫేస్‌బుక్ ద్వారా సందేశం పంపారు.

click me!