
న్యూఢిల్లీ: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతున్నది. ఇక్కడ తొలిసారి బర్డ్ ఫ్లూ హెచ్3ఎన్8 (H3N8) మనిషికి సోకింది. ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా వైరస్ అధికారికంగా తొలిసారి చైనాలోనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కూడా గబ్బిలాల నుంచి మనిషికి సోకిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కొత్త వైరస్ పక్షుల నుంచి మనిషి సోకడంపై ఆందోళనలు రెట్టింపు అవుతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కువగా బాతులు, కోళ్లలో కనిపిస్తుంది. హెచ్3ఎన్8 వైరస్ స్ట్రెయిన్ తొలిసారి ఈ పక్షుల నుంచి మనిషికి సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భయాలు పెరుగుతున్నాయి. అయితే, భయపడాల్సిందేమీ లేదని అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఈ వైరస్ మనుషుల్లో ఎక్కువగా వ్యాపించే అవకాశాల్లేవని వివరిస్తున్నారు.
హెచ్3ఎన్8 స్ట్రెయిన్ తొలిసారి 2002లో ఉత్తరకొరియాలోని బాతుల్లో కనిపించింది. ఈ వైరస్ గుర్రాలు, కుక్కలు, సీల్‌లకూ సోకుతుందని ఇప్పటికే గుర్తించారు. కానీ, మనిషికి కూడా సోకుతుందనే అంచనాలు ఇది వరకు లేవు.
ఈ నేపథ్యంలోనే చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న నాలుగేళ్ల బాలుడిలో బర్డ్ ఫ్లూ హెచ్3ఎన్8 వైరస్ సోకినట్టు తెలిపింది. జ్వరం, ఇతర లక్షణాలతో ఆ బాలుడు ఈ నెల మొదట్లో ఆస్పత్రిలో చేరినట్టు వివరించింది. ఆ తర్వాత పలు టెస్టుల తర్వాత ఆ బాలుడికి బర్డ్ ఫ్లూ హెచ్3ఎన్8 వైరస్ సోకినట్టు తేలిందని పేర్కొంది. ఆ బాలుడి కుటుంబం ఇంటి వద్ద కోళ్లను పెంచుతుందని తెలిపింది. అలాగే, అడవి బాతులు అధికంగా ఉన్న చోట నివసిస్తున్నట్టు వివరించింది.
ఆ బాలుడికి నేరుగా పక్షుల నుంచి వైరస్ సోకినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కానీ, పక్షి నుంచి మనిషికి సోకిన ఆ స్ట్రెయిన్ మళ్లీ ఇతరులకూ సోకేంత పటిష్టంగా లేదని పేర్కొంది. ఆ బాలుడి నుంచి ఇతరులకు సోకే సామర్థ్యం ఆ స్ట్రెయిన్ లేదని వివరించింది. ఆ బాలుడితో సన్నిహితంగా ఉన్నవారి శాంపిల్స్ టెస్టు చేశామని, వారిలో ఎలాంటి అసాధారణ లక్షణాలు లేవని తెలిపింది. ఇది పక్షి నుంచి మానవ జాతికి సోకిన అరుదైన కేసు అని పేర్కొంది. ఆ బాలుడి నుంచి వైరస్ భారీ స్థాయిలో ఇతరులకు వ్యాపించే ముప్పు స్వల్పమేనని వివరించింది.
మరణించిన కోళ్లు, అనారోగ్యానికి గురైన పక్షుల నుంచి ప్రజలు దూరంగా ఉండాలని, అలా ఉన్నవారిలో జ్వరం, ఇతర శ్వాస సంబంధ సమస్యలు ఎదురైతే వారు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకోవాలని సూచనలు చేసింది.
చైనా నగరమైన వుహాన్‌లో కరోనా వైరస్ కనుగొన్నప్పటి నుంచి, ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఈ వైరస్ మొదట ఎలా ఉద్భవించిందనేది, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.వుహాన్ మార్కెట్లలో జంతువుల నుండి మానవులకు వైరస్ సంక్రమించిందా లేదా ల్యాబ్ ప్రమాదంలో లీక్ అయిందా అనే అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. అయితే రెండో సిద్ధాంతాన్ని చైనా తీవ్రంగా ఖండించింది.
ఫిబ్రవరిలో, కోవిడ్ మూలాలపై పరిశోధించే పనిలో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ బృందం చైనాకు వెళ్లింది. వైరస్ బహుశా గబ్బిలాల నుండి వచ్చి ఉంటుందని, అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరం అని ఓ అంచనాకు వచ్చింది.
కానీ, చైనా పారదర్శకంగా వ్యవహరించకపోవడం, డేటా ఇవ్వకపోవడం వల్ల విచారణకు ఆటంకం ఏర్పడిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఆ తర్వాత చెప్పారు.