
అమెరికా : అగ్రరాజ్యం అమెరికాను Covid-19 మళ్లీ వణికిస్తోంది. మంగళవారం వైస్ ప్రెసిడెంట్ Kamala Harrisకు కోవిడ్ -19 పరీక్షల్లో corona positiveగా తేలింది. కరోనా కారణంగా దెబ్బతింటున్న దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన స్థితిగతులను కరోనా పూర్వ సాధారణ స్థితికి తిరిగి రావడానికి యుఎస్ ఇప్పటివరకు ఉన్న కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా తన ఉనికిని మళ్లీ చాటుకుంటోందని వైట్ హౌస్ ప్రకటించింది. ప్రెసిడెంట్ జో బిడెన్ కానీ, ప్రథమ మహిళ జిల్ బిడెన్ కానీ ఇటీవలి కాలంలో కమలా హారిస్‌ను కలవడం కానీ, ఆమెతో సన్నిహితంగా మెలగడం కానీ జరగలేదని వైట్ హౌస్ తెలిపింది.
వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కు మొదటి ర్యాపిడ్ టెస్ట్ చేస్తే అందులో పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత చేసిన పిసిఆర్ పరీక్షలలో కూడా హారిస్ పాజిటివ్ అని తేలిందని వైట్ హౌస్ తెలిపింది. అయితే ఆమెలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు అని వైట్ హౌస్ ప్రకటించింది. పాజిటివ్ నిర్థారణ కావడంతో హారిస్ తన నివాసంలో ఒంటరిగా ఐసోలేట్ అయ్యారు. ఇంట్లో నుంచే రిమోట్ పద్ధతిలో పని చేస్తారని, కరోనా వైరస్ కోసం నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వైట్ హౌస్‌కి తిరిగి వస్తారని తెలిపారు.
హారిస్, 57, మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మొదటి డోస్‌ను పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది వారాల ముందు, రెండవ డోస్ 2021లో ప్రారంభోత్సవ దినం తర్వాత తీసుకున్నారు. ఆమె అక్టోబర్ చివరలో బూస్టర్ షాట్, ఏప్రిల్ 1న ఎక్ స్ట్రా బూస్టర్ షాట్ కూడా తీసుకున్నారు. కరోనా టీకాలు అన్ని డోసులు తీసుకున్నవారు.. కోవిడ్-19 తీవ్ర ప్రభావానికి లోనుకారు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యం, మరణం సంభవించకుండా ఉంటుంది. ప్రత్యేకించి అత్యంత సాధారణమైన, ఎక్కువగా వ్యాపిస్తునన ఓమిక్రాన్ వేరియంట్ నుండి రక్షణ కలుగుతుంది.
కాగా, పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీముఖ్యంగా కొత్త వేరియంట్లు భయాందోళనలు కలిగిస్తున్నాయి. అవి ఇప్పటివరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా వ్యాపించే.. ప్రమాదకరమైన వేరియంట్లుగా అంచనాలు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా, కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం కరోనా డాష్ బోర్దు వివరాల ప్రకారం.. ఇప్పటివరకుప్రపంచ వ్యాప్తంగా 509.1 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనా వైరస్ తో పోరాడుతూ 6.24 మిలియన్ల మంది చనిపోయారు.
ఏప్రిల్ 24, ఆదివారం ఉదయం యూనివర్సిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSSE) ప్రస్తుత గ్లోబల్ కాసేలోడ్, మరణాల సంఖ్య వరుసగా 509,166,036, 6,216,725గా ఉందని వెల్లడించింది. అయితే, మొత్తం ఇప్పటివరకు ఇచ్చిన టీకా మోతాదుల సంఖ్య 11,233,194,944కి పెరిగింది. కాగా సీఎస్ఎస్ఈ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసులు మరియు మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 80,971,925 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 991,231 మంది మరణించారు.