చిన్నారులకు తిండిపెట్టలేక కిడ్నీలు అమ్ముకుంటున్న తండ్రులు.. ఆఫ్గాన్ లో దయనీయ పరిస్థితులు..

By SumaBala BukkaFirst Published Jan 14, 2022, 11:26 AM IST
Highlights

దుర్భర పేదరికంలోకి జారుకున్న ప్రజలు డబ్బు కోసం అవయవాలను అమ్ముకునేందుకు వెనకాడటం లేదు. హెరాత్  ప్రావిన్స్లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకు వస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు.

కాబుల్ : Talibanల పాలనలో ఆప్గన్ల పరిస్థితి దయనీయంగా మారింది. చేసేందుకు పని.. చేతిలో డబ్బు..  తినేందుకు తిండి కరువయ్యాయి. ఆకలి బాధతో చిన్నా,పెద్దా అలమటిస్తున్నారు. పిల్లల కడుపు నింపేందుకు తండ్రులు దిక్కుతోచని స్థితిలో తమ శరీర భాగాలను అమ్ముకుంటున్నారు. చిన్నారులను కాపాడుకునేందుకు తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. ‘నేను బయటకు వెళ్లి డబ్బులు అడుక్కోలేను. అందుకే ఆసుపత్రికి వెళ్లి నా Kidney ని రూ. 1,69,000లకు అమ్మేశాను. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైన తిండి పెడతాను’ అని గులాం హజ్రత్ అనే వ్యక్తి చెప్పారు. ఆఫ్గాన్ లో చాలామంది Fatherలు ఇదే తరహా వ్యథతో ఉన్నారు

తాలిబన్లు అధికారంలోకి వచ్చాక Afghanistan తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దుర్భర పేదరికంలోకి జారుకున్న ప్రజలు డబ్బు కోసం అవయవాలను అమ్ముకునేందుకు వెనకాడటం లేదు. హెరాత్  ప్రావిన్స్లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకు వస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు.

కిడ్నీ దాత, కొనుగోలుదారు పరస్పర అంగీకారంతోనే ఇలా జరుగుతోందన్నారు. కిడ్నీని కోల్పోవడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల కంటే వారి కుటుంబ పోషణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కిడ్నీని ఇచ్చేశాక.. కనీసం ఏడాది పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. రెండు నెలలకే దొరికిన పనికి వెళ్ళిపోతున్నారు. తమ ఆర్థిక స్థితికి ఖాళీగా ఉండలేమని తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

చాలామంది ప్రాణభయంతో ఇప్పటికే దేశం విడిచి వెళ్లారని..  వారిలో కొందరిని ఆయా దేశాలు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపాయని స్థానిక మత పెద్ద చెప్పారు.  దేశం విడిచి వెళ్లే ముందు ఇక్కడ ఉన్న అప్పులు తీర్చేందుకు కూడా చాలామంది కిడ్నీలు  అమ్ముతున్నారని వివరించారు.

ఆదుకో కుంటే ఆకలి చావులే.. 87 లక్షల మంది ప్రాణాలకు ముప్పు..

ఆఫ్ఘన్లో ఆకలి సునామీ రాబోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్ పీ) గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలు  పక్కన పెట్టి  తక్షణమే  మానవతా  సాయం అందించాలని ఆఫ్గాన్ లోని డబ్ల్యూ ఎఫ్ పి ప్రతినిధి మేరీ ఎల్లెన్ మెక్ గ్రోర్టీ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రస్తుతం 2.78 కోట్ల మందికి తీవ్రమైన ఆహార కొరత ఉందని, ఇందులో  87 లక్షల మంది ఆకలి చావులకు చేరువయ్యారని ఆమె వాపోయారు.

ఆకలి తీర్చేందుకు తమకు నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. వచ్చే 12 నెలలపాటు పూర్తిస్థాయిలో మానవతా సాయం కొనసాగించేందుకు కనీసం 4.4 బిలియన్ డాలర్లు కావాలన్నారు. ఆహార పంపిణీ కనీస స్థాయిలో చేపట్టాలన్నా 2.6 బిలియన్ డాలర్లు అవసరమని చెప్పారు. ఆఫ్గాన్ కు  గతంలో సాయం చేసిన వారంతా తిరిగి మానవతా దృక్పథంలో ప్రారంభించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. 

click me!