
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ ఏడంతస్తుల బిల్డింగ్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 14 మంది దుర్మరణం చెందారు. 100కు పైగా మంది గాయపడ్డారు. సహాయక సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. శిథిలాలు తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
11 మంది ఫైర్ ఫైటింగ్ యూనిట్లు వెళ్లాయి. ఓల్డ్ ఢాకాలో జనసాంధ్రత అధికంగా ఉండే గలిస్తాన్ ఏరియాలోని బిల్డింగ్‌లో సాయంత్రం 4.50 గంటలకు ఈ పేలుడు సంభవించినట్టు ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ తెలిపింది.
ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలు లభించాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని ఫైర్ సర్వీస్ అధికారులు రిపోర్టర్లకు తెలిపారు. పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ఆఫీసులు, బిజినెస్ కాంప్లెక్స్‌లలో అక్రమంగా నిల్వ చేసే కొన్ని కెమికల్స్ కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యక్ష సాక్షి సఫాయెత్ హొస్సెయిన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ, తొలుత ఇది భూకంపం అని భావించినట్టు చెప్పాడు. సిద్దిక్ బజార్ మొత్తం వణికిపోయిందని తెలిపాడు. ఆ బిల్డింగ్ ముందు 20 నుంచి 25 మంది రోడ్డుపై పడి గాయపడిన దృశ్యం తాను చూశానని పేర్కొన్నాడు. వారంతా తీవ్రంగా గాయపడి రక్తంతో సహాయం కోసం అర్ధిస్తున్నారని వివరించాడు. ఇంకొందరు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారని తెలిపాడు. క్షతగాత్రులను స్థానికులు వ్యాన్లు, రిక్షాలల్లో తీసుకెళ్లారని అన్నాడు.
పదుల సంఖ్యలో క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు.