
ఉక్రెయిన్‌లో (Ukraine) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులను పంపి విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తుంది. సరిహద్దులకు చేరేలా విద్యార్థులకు సూచనలు ఇవ్వడమే కాకుండా.. అక్కడికి చేరుకున్నాక స్వదేశానికి తరలింపు ప్రక్రియను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సీ-17 విమానాలు కూడా భారతీయులను తీసుకురావడానికి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలను తరలివెళ్లాయి. వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకని రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. రాజధాని కీవ్‌తో పాటుగా, తూర్పు ప్రాంతంలోని నగరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేస్తుంది. రష్యా సరిహద్దుకు సమీపంలో ఉండే ఖర్కీవ్‌లో(ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం) జరిగిన షెల్లింగ్‌లో భారత విద్యార్థి నవీన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో ఖర్కీవ్‌తో పాటు తూర్పు ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై వారి కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి.
ఇక, ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి దాదాపు భారతీయులు పశ్చిమ ప్రాంతాలకు తరలివెళ్లారని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కీవ్‌లో ఉన్న రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసినట్టుగా తెలిపాయి. పశ్చిమాన ఉన్న లీవ్‌లో తాత్కాలికంగా ఎంబసీని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నాయి. ఇప్పటికే చాలా వరకు భారత విద్యార్థులు ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి, అటువైపు ఉన్న సరిహద్దులకు చేరుకున్నారు. అయితే తూర్పు వైపు ప్రాంతాల్లో ఉండిపోయిన (రష్యా సరిహద్దు) వైపు ఉండిపోయిన విద్యార్థుల తరలింపుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అటువైపు రష్యా సైన్యం భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎలా తరలించాలనే ఆలోచనలు చేస్తుంది.
అయితే తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రష్యా భూభాగం గుండా తరలించే విషయమై భారత అధికారులతో రష్యా చర్చలు జరుపుతోందని రష్యా దౌత్యవేత్త ఒకరు తెలిపారు. ‘ఖర్కివ్, తూర్పు ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం మేము భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. అక్కడ చిక్కుకున్న వారందరినీ రష్యన్ భూభాగం గుండా అత్యవసరంగా తరలించాలని భారతదేశం చేసిన అభ్యర్థనలను మేము స్వీకరించాం’ అని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ చెప్పారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా జరుగుతుందని చెప్పారు.
ఖర్కివ్, సుమీ, ఇతర సంఘర్షణ ప్రాంతాలలో భారతీయ పౌరుల భద్రత గురించి రష్యా అధికారులు భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సమస్యపై ఐక్యరాజ్యసమితిలో భారత్ తీసుకున్న వైఖరిని ఆయన ప్రశంసించారు. ‘మేము భారత్‌తో వ్యూహాత్మక మిత్రులం. ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించిన సమతుల్య స్థితికి మేము భారతదేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంక్షోభం యొక్క లోతును భారతదేశం అర్థం చేసుకుంది’ అని అలిపోవ్ అన్నారు. ఇక, ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై పాశ్చాత్య ఆంక్షల కారణంగా భారత్‌కు ఎస్-400 సరఫరాపై ఎటువంటి ప్రభావం ఉండబోదని చెప్పారు.
గత వారం ఉక్రెయిన్‌పై ఐకరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే ఆ ప్రాంతంలో హింసను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని భారత్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.