
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ - రష్యాల మధ్య ఆరో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే పలు నగరాలను ధ్వంసం చేసి.. రష్యా దళాలు .. సామాన్య పౌరుల కూడా దాడులు చేసున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రష్యా ఉక్రెయిన్ పై చేసిన బాంబు దాడిలో భారత విద్యార్థి మరణించాడు. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఒక భారతీయ విద్యార్థి క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయాడని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ధృవీకరించింది. మృతుడు విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ్ గా గుర్తించారు.
ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరింధమ్ బగ్చీ ట్వీట్ చేశారు. మంగళవారం ఉదయం ఖార్కివ్‌లో జరిగిన క్షిపణి దాడిలో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖార్కివ్‌లో జరిగిన క్షిపణి దాడిలో కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ్ అనే విద్యార్థి మరణించాడు. నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరింధమ్ బగ్చీ.
తాజాగా.. భారతీయ విద్యార్థి మృతి పట్ల యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ఐరోపా దేశాలు హృదయపూర్వకంగా సహాయం చేస్తున్నాయని మిచెల్ చెప్పారు. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు ఏకం కావాలని నొక్కి చెప్పారు. అమాయక పౌరులపై రష్యా విచక్షణారహిత దాడుల కారణంగా ఖార్కివ్‌లో ఒక భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ మృతుడి కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానట్టు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.
న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భారతీయ విద్యార్థి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. యూఎస్ మిషన్ భారత్ ప్రతినిధి ప్యాట్రిసియా లాసినా కూడా.. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థి మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు, భారతీయ ప్రజలకు మేము మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ కూడా భారతీయ విద్యార్థి మృతికి సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ మానవతా చట్టాన్ని గౌరవించడం, పౌరుల రక్షణ, అవరోధం లేని మానవతా ప్రాప్యత కోసం పిలుపునిస్తూ UN భద్రతా మండలి తీర్మానాన్ని సిద్ధం చేస్తోందని చెప్పారు.