భారతీయ విద్యార్థుల తరలింపు.. ఖార్కివ్ పైనే ఫోకస్, ఉక్రెయిన్‌కు 26 విమానాలు పంపనున్న కేంద్రం

Siva Kodati |  
Published : Mar 01, 2022, 10:10 PM IST
భారతీయ విద్యార్థుల తరలింపు.. ఖార్కివ్ పైనే ఫోకస్, ఉక్రెయిన్‌కు 26 విమానాలు పంపనున్న కేంద్రం

సారాంశం

ఉక్రెయిన్‌లో రష్యా దళాల దాడిలో కర్ణాటకకు చెందిన విద్యార్ధి మరణించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు  తీసుకున్నారు. విద్యార్ధుల తరలింపు కోసం వచ్చే మూడు రోజుల్లో 26 విమానాలను పంపాలని  నిర్ణయించారు. 

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (russia ukraine crisis) నేపథ్యంలో విద్యార్ధుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరోవైపు.. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్దం మరింతగా ముదురుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ చిక్కుకున్న భారతీయులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్న భారత ప్రభుత్వం, ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను భారతీయులు వెంటనే విడిచివెళ్లాలని ఆదేశించింది. విద్యార్థులతో పాటు భారతీయులందరూ ఈ రోజే అత్యవసరం కీవ్ నగరాన్ని వదిలివెళ్లాలని భారత ఎంబసీ మంగళవారం ట్విట్టర్‌లో సూచించింది. అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా బయటపడాలని తెలిపింది. 

ఇకపోతే.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా (operation ganga) పేరుతో స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తొలుత సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి చేరుకునేలా సూచనలు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలతో మరింత సమన్వయంతో వ్యవహరించేందుకు.. నలుగురు కేంద్ర మంత్రులను  ప్రత్యేక దూతలుగా అక్కడి పంపాలని నిర్ణయం తీసుకుంది.

మరోవైపు రష్యా దాడుల్లో మనదేశానికి చెందిన విద్యార్ధి మరణించడంతో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది. మృతుడిని కర్ణాటకకు (karnataka) చెందిన నవీన్‌గా (naveen) గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (ministry of external affairs) అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ శాఖలకు కేంద్రం ఫోన్ చేసి .. తమ విద్యార్ధుల తరలింపునకు సహకరించాల్సిందిగా కోరింది. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. ఇతను ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ మరణం పట్ల విదేశాంగ శాఖ తీవ్ర సంతాపం తెలిపింది. 

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా.. రొమేనియా, మాల్దోవాల నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్‌ రిజిజు స్లొవేకియాకు, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి హంగరీకి, కేంద్ర రోడ్డు, రవాణా, విమానయాశ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ పోలండ్‌ వెళ్తారు.

భారతీయుల తరలింపు ప్రయత్నాల్లో భాగం పంచుకోవాలని ప్రధాని మోదీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు పిలుపునిచ్చారు. వైమానిక దళం యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఖాళీ చేయగలుగుతామని మోదీ అభిప్రాయపడినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే భారత వైమానిక దళం ఈరోజు నుంచి ఆపరేషన్ గంగాలో భాగంగా పలు C-17 విమానాలను అక్కడికి పంపే అవకాశం ఉంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం