కూలిన ఇథియోపియా విమానం, 157 మంది మృతి: మృతుల్లో ఆంధ్ర అమ్మాయి

By telugu teamFirst Published Mar 11, 2019, 7:12 AM IST
Highlights

మొత్తం 157 మంది మృతుల్లో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా, పర్యావరణ శాఖ సలహాదారు శిఖా గార్గ్‌ సహా నలుగురు భారతీయులు ఉన్నారు. 

నైరోబీ: ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మృత్యువాత పడ్డారు. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానం ఆదివారం ఉదయం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. 

మొత్తం 157 మంది మృతుల్లో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా, పర్యావరణ శాఖ సలహాదారు శిఖా గార్గ్‌ సహా నలుగురు భారతీయులు ఉన్నారు. అడిస్‌ అబాబా విమానాశ్రయం నుంచి కెన్యాలోని నైరోబీకి బయలుదేరిన 6 నిమిషాలకే (స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44గంటల సమయంలో) బిషోఫ్టు పట్టణం పరిసరాల్లో విమానం కూలిపోయిన విషయం తెలిసిందే.
 
మృతుల్లో కెన్యా, ఇథియోపియా, కెనడా, చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఈజిప్టు, నెదర్లాండ్‌, స్లొవేకియా, భారత్‌కు చెందినవారు ఉన్నారు. కుప్పకూలిన విమాన శకలాలను తమ సంస్థ సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం పరిశీలిస్తున్న ఓ ఫొటోను విడుదల చేసింది. అదే విషయమై సీఈఓ టెవోల్డే మీడియాతో మాట్లాడారు. 
"ఇబ్బందిగా ఉంది.. ముందుకెళ్లే పరిస్థితి లేదు.. వెనక్కి వచ్చేస్తాం" అంటూ కంట్రోల్‌ రూమ్‌కు పైలట్‌ సందేశం పంపాడన్నారు.  కంట్రోల్‌ రూమ్‌ నుంచి వెంటనే అనుమతులు ఇచ్చినా కూడా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. 

ఇథియోపియా విమాన ప్రమాద ఘటనలో మృతిచెందిన నలుగురు భారతీయుల వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. మృతుల్లో పర్యావరణ- అటవీ శాఖ కన్సల్టెంట్‌ శిఖా గార్గ్‌, నూకవరపు మనీషా, వైద్యహన్సిన్‌, వైద్య పన్నగేష్‌ భాస్కర్‌ అనే నలుగురు భారతీయులు ఉన్నట్లు తెలిపారు. 

కెన్యా రాజధాని నైరోబీలో జరగనున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రా జెక్టు సదస్సులో పాల్గొనేందుకు శిఖాగార్గ్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

click me!