
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మొదలు.. కరోనా కాలంలోనూ పని చేసిన కంపెనీలు అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి. కరోనా కారణంగా బయట అడుగుపెట్టే పరిస్థితులు లేకపోవడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే సుమారు రెండేళ్లుగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పుడు అవే కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేసి మళ్లీ ఆఫీసుకు
తిరిగి రావాలని కోరుతుంటూ ఉద్యోగులు అందుకు ఆమోదయోగ్యంగా లేరు. వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి మళ్లీ ఆఫీసుకు తిరిగి వచ్చే ప్రసక్తే లేదని, అవసరం అయితే ఉద్యోగమే మానేస్తామని చెబుతున్నారు.
కరోనా మహమ్మారి విజృంభించి రెండేళ్లు గడిచింది. కరోనా ఉధృతి వెనుకపట్టు పట్టిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎత్తేయాలని యాపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు డిసైడ్ అయ్యాయి. అయితే, సాధారణంగా ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంటుంది కాబట్టి, వారిని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నాయి. యాపిల్ కంపెనీ ఉద్యోగులు మాత్రం మళ్లీ ఆఫీసుకు రావాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తున్నారు. సుమారు 76 శాతం మంది యాపిల్ ఉద్యోగులు కంపెనీ విధాన నిర్ణయాన్ని నిరసిస్తున్నారు. వారానికి ఒక రోజు ఆఫీసుకు రావాలని యాపిల్ యాజమాన్యం ఉద్యోగులను ఆదేశించింది. ఈ నెల 23వ తేదీ నుంచి వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసులో ఉండాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఆదేశించారు. వారంలో ఒక్క రోజు ఆఫీసుకు రావడాన్నే ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. మూడు రోజులు అనడంతో వారు మరింత ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతున్నారు.
అసలు ఉద్యోగుల మనసులో ఏముందో కనుక్కోవడానికి సోషల్ నెట్‌వర్క్ బ్లైండ్ ఓ సర్వే చేసింది. యాపిల్ మెజార్టీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు తిరిగి రమ్మనే నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు, ఈ నిబంధన కారణంగా వారు యాపిల్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి మరికొంత వెసులుబాటు ఉండే ఉద్యోగంలో చేరాలని ఆలోచనలు చేస్తున్నారని వివరించారు. ఏప్రిల్ 13 నుంచి 19వ తేదీ వరకు 652 మంది యాపిల్ ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించినట్టు బ్లైండ్ తెలిపింది. రోజూ ఆఫీసుకు వెళ్లే మార్గంలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చాలా మంది ఉద్యోగులు చెప్పారు. అంతేకాదు, కచ్చితంగా ఆఫీసుకు రావాలని చెబితే ఉద్యోగం మరింత వెసులుబాటు ఉండేలా ఇతర కంపెనీలో చేరుతామని పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం, 56 శాతం యాపిల్ ఉద్యోగులు వేరే కంపెనీలో చేరాలని యోచిస్తున్నారు. దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు.