నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తర భారతదేశంలో చోటుచేసుకుంటున్న భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తర భారతదేశంలో చోటుచేసుకుంటున్న భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రి నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా నేపాల్‌లో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. ఆదివారం నేపాల్‌లో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున 1 గంటల తర్వాత భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) నివేదించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా పేర్కొంది.
ఇక, శుక్రవారం అర్దరాత్రి చోటుచేసుకున్న భూకంపం నేపాల్‌లో పెను విషాదాన్ని నింపింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. భూకంపంలో మృతుల సంఖ్య శనివారం నాటికి 157కి చేరుకుంది. బాధిత ప్రాంతాలకు వీలైనంత సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ప్రధాని నారాయణ్ కాజీ శ్రేష్ఠ శనివారం తెలిపారు. ఎక్కువగా వ్యవసాయ ప్రాంతమైన జాజర్‌కోట్ జిల్లాలో కనీసం 105 మంది మరణించారని, పొరుగున ఉన్న రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరో 184 మంది గాయపడ్డారని చెప్పారు.