కరోనా వైరస్ మనిషి శరీరంలో వ్యాపించకుండా అడ్డుకునే యాంటీబాడీని గుర్తించినట్లు ఉట్రేచ్ట్ యూనివర్శిటీలోని ‘ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హెర్బల్ బయోమెడ్’ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా వేలసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా... ఇప్పటి వరకు ఈ వైరస్ కి మందు కానీ, వ్యాక్సిన్ కానీ కనిపెట్టలేకపోయారు.
అయితే.. కరోనా వైరస్ మనిషి శరీరంలో వ్యాపించకుండా అడ్డుకునే యాంటీబాడీని గుర్తించినట్లు ఉట్రేచ్ట్ యూనివర్శిటీలోని ‘ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హెర్బల్ బయోమెడ్’ ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘నేచర్ కమ్యూనికేషన్స్’ అనే ఆన్ లైన్ పత్రిక దీనిని ప్రచురించింది. కరోనా చికిత్సలో దీనిని కీలక అడుగుగా ఆ పత్రిక అభివర్ణించింది. ఈ కణం సార్స్ కోవ్ 2 లోకి ఒక కణాన్ని పట్టుకొని వ్యాప్తిని అడ్డుకుంటుందని ఈ పరిశోధనకు అధ్యక్షత వహించిన డాక్టర్ బాష్ వెల్లడించారు. ఈ యాంటీబాడీకి ఉన్న క్రాస్ న్యూట్రలైజింగ్ గుణం ఆసక్తికరంగా ఉంది.
ఇది కరోనా వైరస్ అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సార్స్ కోవ్ 1 యాంటీ బాడీలను ఉపయోగించి సార్స్ కోవ్ 2 ను అడ్డుకొనే వ్యాధి నిరోధక కణాలను గుర్తించాం అని ఆయన వెల్లడించారు.
దీనిపై హెచ్బీఎం ఛైర్మన్ డాక్టర్ జింగ్ సాంగ్ వాంగ్ మాట్లాడుతూ.. ‘‘ ఇది కీలక మలుపు. ఈ యాంటీ బాడీ మానవ శరీరంలో వ్యాధి తీవ్రతను ఎంతమేరకు నిలువరిస్తుందనే అంశంపై మరింత పరిశోధనలు చేయాలి. మా భాగస్వాములతో కలిసి ఈ పరిశోధనలను ముందుకు తీసుకువెళతాం. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో మా పరిశోధన ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.