ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ. 5వేల కోట్లు చెల్లించండి.. దుబాయ్ షేక్‌కు బ్రిటీష్ కోర్టు ఆర్డర్

By Mahesh KFirst Published Dec 21, 2021, 11:48 PM IST
Highlights

బ్రిటీష్ కోర్టులో దుబాయ్ షేక్ విడాకుల వ్యవహారం సద్దుమణిగింది. ఈ సెటిల్‌మెంట్ భారీ మొత్తంతో కూడుకుని ఉన్నది. తన భార్యకు సుమారు 5.5వేల కోట్ల రూపాయాలు అందించాల్సిందిగా బ్రిటీష్ హైకోర్టు తీర్పు చెప్పింది. తన భార్య సెక్యూరిటీ కవర్, పిల్లల కోసం డబ్బులు ఆయన పంపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 2019లో ప్రిన్సెస్ హయా.. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్‌ నుంచి పారిపోయి యూకే వచ్చారు.
 

న్యూఢిల్లీ: దుబాయి పాలకుడు(Dubai Ruler) షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌కు, ఆయన మాజీ భార్య(Ex Wife) హయా బింత్ అల్ హుస్సేన్‌కు మధ్య విడాకుల సెటిల్‌మెంట్ జరిగింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తన మాజీ భార్య, వారి పిల్లలకు సుమారు 550 పౌండ్లు(సుమారు 730 మిలియన్ డాలర్లు.. ఇది 5.5 వేల కోట్ల రూపాయలకు సమానం) చెల్లించాలని బ్రిటీష్ కోర్టు ఆదేశించింది. బ్రిటీష్ చరిత్రలో ఖరీదైన డైవర్స్(Divorce) సెటిల్‌మెంట్‌లలో ఇది నిలవనుంది.

షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తన ఆరో భార్య ప్రిన్సెస్ హయా బింత్ అల్ హుస్సేన్‌కు 251.5 మిలియన్ పౌండ్లను ఇవ్వాలని, అలాగే, పిల్లలు అల్ జలీల్(14), జాయెద్(9)ల ఖర్చు కోసం డబ్బులు చెల్లించాలని, ఇందుకోసం 290 మిలియన్ పౌండ్లను బ్యాంక్ గ్యారంటీ రూపంలో వారికి అందుబాటులో ఉంచాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. పిల్లలు జీవించే కాలం, తండ్రితో వారి వైఖరిపై ఆధారపడి వారి చెల్లింపులు ఉండనున్నాయి. మొత్తంగా 290 మిలియన్ పౌండ్లకు అటూ ఇటూగా వారికి సొమ్ము లభించనుంది. పిల్లల మైనార్టీ తీరే వరకు వారికి, భార్య హయాకు సెక్యూరిటీ కవర్ కోసం ఏడాదికి 11 మిలియన్ పౌండ్లను అందించాలని కోర్టు తెలిపింది. వీరికి కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, ఎందుకంటే వీరికి ముప్పు షేక్ మొహమ్మద్ నుంచే ఉన్నదని న్యాయమూర్తి ఫిలిప్ మూర్ తెలిపారు.

Also Read: విడాకుల భరణంగా రూ.52వేల కోట్లు కావాలి.. ఓ భార్య ట్విస్ట్.. ఎక్కడంటే...

హయా జోర్డాన్ దివంగత రాజు హుస్సేన్ కుమార్తె. ఆమె దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో ఆమె దుబాయ్ నుంచి పారిపోయి యూకేకు వెళ్లింది. తన ఇద్దరు పిల్లలకు చట్టబద్ధమైన రక్షణ కోసం బ్రిటీష్ కోర్టును ఆశ్రయించారు. తన ఇద్దరు కూతుళ్లను బలవంతంగా యూఏఈకి రావాల్సిందిగా బెదిరింపులకు పాల్పడి తన భర్త భయాందోళనలు కలిగించారని ఆమె కోర్టులో తెలిపారు.

వీరిమధ్య ఈ న్యాయ పోరాటం జరుగుతుండగానే ప్రిన్సెస్ హయా ఫోన్‌ను షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ హ్యాక్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారించిన బ్రిటీష్ ప్రత్యేక ఫ్యామిలీ కోర్టు ఈ ఆరోపణలను సమర్థించింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్‌వో తయారు చేసిన స్పైవేర్ పెగాసెస్‌తో ఆయన తన భార్య మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేశారని కోర్టు తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను షేక్ మొహమ్మద్ ఖండించారు. విడిగా తనతో దూరంగా జీవిస్తున్న భార్య హయాను భయభ్రాంతులకు గురిచేసే, బెదిరించే పనులు షేక్ మొహమ్మద్ చేసినట్టు న్యాయమూర్తి మెక్ ఫర్లాన్ వివరించారు. అపహరణలు, బలవంతంగా తన ఇద్దరు బిడ్డలను తిరిగి దుబాయ్‌కు రప్పించడం వంటి చర్యలు ఆయన చేశారని తెలిపారు.

click me!