
న్యూఢిల్లీ: ఓ మహిళ డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడింది. కానీ, ఆమె వితండ వాదం చేసింది. ఒక వైపు తాను వొడ్కా తాగాను అని చెబుతూనే.. ఆ వొడ్కాను నోటితో కాకుండా కంటితో తాగానని చెప్పడం సంచలనం రేపింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.
ఇంగ్లాండ్‌కు చెందిన చెల్సియా మెక్ డొనాల్డ్ (30) అనే మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌కు బయల్దేరి వెళ్లింది. ఆమె బార్ పార్కింగ్ ఏరియాలో తన బీఎండబ్ల్యూ కారును నిలిపి బయటకు అడుగు పెట్టింది. అంతలోనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆల్కహాల్ టెస్టు చేశారు. సాధారణ స్థాయిల కంటే రెండు రెట్లు అధికంగా చూపెట్టింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్‌లో గతేడాది నవంబర్‌లో జరిగింది.
కానీ, చెల్సియా మెక్ డొనాల్డ్ మాత్రం తాను తప్పు చేయలేదని వాదించుకొచ్చింది. తాను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోనే కారును డ్రైవ్ చేశానని చెప్పింది. అయితే, కారును ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత తన మిత్రులు కలిసి అందుబాటులో ఉన్న వొడ్కాను స్వల్ప సమయంలోనే పూర్తి చేయాలని అనుకున్నారు. ఇందుకు కంటిలో పోసుకోవడం ద్వారా వొడ్కాను చాలా వేగంగా పూర్తి చేయవచ్చని భావించారని వివరించింది. అలాగే, ఆ బాటిల్ వొడ్కాను తాగి బయట అడుగు పెట్టామని తెలిపింది.
తమ కారులోని ఓ ఫ్రెండ్ ఈ సలహా ఇచ్చిందని, సమయం లేదు కాబట్టి, ఈ వొడ్కాను మన కన్నులపై ఉంచుదామా? అని అడిగిందని మెక్ డొనాల్డ్ తెలిపింది. ఈ సూచనతో తాను చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పింది. అదే పని చేశామని వివరించింది.
అయితే, ఈ వాదనలను మెజిస్ట్రేట్ తిప్పికొట్టింది. ఆమె రిడిక్యులస్ వ్యాఖ్యలపై సీరియస్ అయింద.
అసలు ఇది సాధ్యమే కాదని ప్రాసిక్యూటర్ పౌలా గ్రోగన్ అన్నారు. మెక్ డొనాల్డ్, వారి ఫ్రెండ్స్ ఇద్దరూ కేవలం 14 సెకండ్‌లలో ఆ డ్రింకింగ్ పూర్తి చేస్తారని తాను అనుకోవడం లేదని వివరించింది.
ఈ వాదనల తర్వాత మెజిస్ట్రేట్ మెక్ డొనాల్డ్‌ను నేరస్తురాలుగా గుర్తించింది. కేవలం 18 నెలల పాటు డ్రైవింగ్ చేయవద్దని ఆదేశించింది. రాత్రి పూట 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆమెపై కర్ఫ్యూ విధించింది.