చైనా వర్సెస్ అమెరికా.. నిప్పుతో చెలగాటం వద్దన్న జో బైడెన్.. టచ్ చేస్తే వదిలిపెట్టబోమన్న చైనా

Published : May 23, 2022, 05:48 PM IST
చైనా వర్సెస్ అమెరికా.. నిప్పుతో చెలగాటం వద్దన్న జో బైడెన్.. టచ్ చేస్తే వదిలిపెట్టబోమన్న చైనా

సారాంశం

క్వాడ్ సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చాడు. స్వయం పాలిత దేశం తైవాన్‌ను దురాక్రమించే ఆలోచనలు చేసి నిప్పుతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలకు చైనా వెంటనే కౌంటర్ ఇచ్చింది. చైనా సార్వభౌమ, భౌగోళిక సమగ్రత విషయాలను టచ్ చేస్తే కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదని తెగేసి చెప్పేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని పేర్కొంది.

న్యూఢిల్లీ: క్వాడ్ సదస్సు ముందర అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చాడు. చైనా నిప్పుతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించాడు. తైవాన్‌కు ఒక వేళ చైనా ఆక్రమించాలని చూస్తే.. తైవాన్‌కు అండగా తాము ఉంటామని స్పష్టం చేశాడు. తాము చైనా వన్ పాలసీపై సంతకం పెట్టామని, కానీ, ఒక వేళ చైనా బలవంతంగా అంటే మిలిటరీ ప్రయోగించి తైవాన్‌ను దురాక్రమించుకోవాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోబోమని వివరించాడు. బలప్రయోగం ద్వారా తైవాన్‌ను ఆక్రమించుకోజూస్తే ఆ భౌగోళిక ప్రాంతంలో అస్థిరత ఏర్పడుతుందని అనుమానించాడు.

ఉక్రెయిన్, రష్యా యుద్ధం చూసి చైనా పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా బల ప్రయోగం చేస్తే పశ్చిమ దేశాలు, అమెరికా ఎలా వ్యవహరిస్తున్నాయో పరిశీలించాలని సూచించాడు. ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయని, కాబట్టి, చైనా కూడా తైవాన్‌ను మిలిటరీ ద్వారా ఆక్రమించుకోవాలని చూస్తే తాము తైవాన్‌కు మిలిటరీపరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేశాడు.

కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలకు చైనా వెంటనే కౌంటర్ ఇచ్చింది. తైవాన్‌పై తమ దేశ ప్రయోజనాలు కాపాడుకోవడానికి చైనా సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ బెన్‌బిన్ స్పందిస్తూ.. చైనాలో అవిభాజ్య అంతర్భాగంగా తైవాన్ ఉన్నదని వివరించాడు. తైవాన్ అంశం పూర్తిగా చైనా అంతర్గత విషయం అని పేర్కొన్నాడు. చైనా సార్వభౌమ, భౌగోళిక సమగ్రత అంశాలను ఎవరైనా టచ్ చేయాలని చూస్తే.. చైనా అస్సలే కాంప్రమైజ్ కాదని స్పష్టం చేశాడు. కాంప్రమైజ్ కాదని, ఉపేక్షించదని పేర్కొన్నాడు. దేశ సార్వభౌమ, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడానికి చైనా ప్రజల కమిట్‌మెంట్‌ను తక్కువ అంచనా వేయవద్దని అన్నాడు.

చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ స్వయం పాలిత దేశం తైవాన్‌ను నియంత్రించలేదు. కానీ, ఆ ద్వీప దేశాన్ని చైనా అంతర్భాగంగా చూస్తున్నది. ఏదో ఒక రోజు కచ్చితంగా తైవాన్‌ను తమ దేశ అధీనంలోకి తెచ్చుకుంటామని భావిస్తున్నది. అందుకు అవసరమైతే బల ప్రయోగాన్ని అయినా చేయాలనే ఆలోచనలో చైనా ఉన్నది.

చైనాను కంట్రోల్ చేయడానికే అమెరికా వ్యూహంతో క్వాడ్ కూటమి ఏర్పడినట్టు కొందరు విమర్శకులు చెబుతున్నారు. చైనాకు చెక్ పెట్టడానికి అటు ఆస్ట్రేలియాను, ఇటు భారత్‌ను ఉపయోగించుకోవాలనేదే అమెరికా ఎత్తుగడ అనేది విమర్శకుల అభిప్రాయం. అందుకే అమెరికా దేశం చైనా పొరుగున ఉంటున్న కీలక దేశాలతో ఈ కూటమిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది.

ఈ సారి క్వాడ్ సదస్సు జపాన్‌లో జరుగుతున్నది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని, ఆస్ట్రేలియా నూతన ప్రధాని పాల్గొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !