పడిపోయిన అమెరికా.. సురక్షిత దేశంగా జర్మనీ

By telugu news teamFirst Published Apr 16, 2020, 11:18 AM IST
Highlights
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరు ఆధారంగా ప్రపంచ దేశాలకు ఈ సంస్థ ర్యాంకులను కేటాయించింది. జర్మనీలోని ప్రజలు మిగతా దేశాల ప్రజలతో పోల్చుకుంటే ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో మెరుగైన స్థితిలో ఉన్నారని పేర్కొంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కుప్పలు తెప్పలుగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతోపాటు.. దేశాల స్థాయిలు కూడా దారుణంగా మారిపోయాయి. దేశాల అభివృద్ధి.. కరోనాకి ముందు.. కరోనాకి తర్వాత అని చెప్పుకునే విధంగా మారడం గమనార్హం.

మొన్నటి వరకు అభివృద్ధ దేశం, సురక్షిత దేశాలు అని చెప్పుకున్న దేశాలన్నీ ఇప్పుడు దిగువకు జారిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్క జర్మనీ, దక్షిణ కొరియా తప్ప మిగితా దేశాలేవీ కరోనాను సమర్థవంతంగా ఎదురుకున్న దాఖలాలు లేవు. అందుకే లండన్ కు చెందిన డీప్ నాలెడ్జ్ గ్రూప్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యంత సురక్షిత దేశాల్లో జర్మనీ రెండో స్థానం దక్కించుకుంది.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరు ఆధారంగా ప్రపంచ దేశాలకు ఈ సంస్థ ర్యాంకులను కేటాయించింది. జర్మనీలోని ప్రజలు మిగతా దేశాల ప్రజలతో పోల్చుకుంటే ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో మెరుగైన స్థితిలో ఉన్నారని పేర్కొంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా ప్రకారం జర్మనీలో ఏప్రిల్ 14నాటికి 1.3లక్షల కేసులు నమోదైతే దాదాపు సగం మంది రోగులు పూర్తిగా కోలుకున్నారు.

కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న మరోదేశం ఇజ్రాయెల్‌ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. దేశ సరిహద్దులను మూసేయడంలో వేగంగా స్పందించడం ఈ దేశానికి కలిసొచ్చింది. స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, చైనా కూడా మెరుగ్గానే ఉన్నాయి. 

రోజూ వేలకొద్ది మరణాలతో అల్లాడుతున్న అమెరికా సురక్షిత నగరాల జాబితాలో 70వ స్థానానికి దిగజారడం గమనార్హం. కరోనా వ్యాప్తిని గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, వైద్య సదుపాయాలను సిద్ధం చేయడం, మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం, క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌, అత్యవసర సేవలను సమర్థంగా అందించడం తదితర అంశాల్లో వివిధ దేశాల పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. 

అయితే ప్రపంచంలోని అన్ని దేశాలను ఇందులో పరిగణనలోకి తీసుకోవాలి. వాటి లెక్కలు కూడా రూపొందిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ వెలువరించిన సమాచారం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ప్రభుత్వాల నిర్ణయాలు, పనితీరును బట్టి ఈ ర్యాంకులు మారే అవకాశం లేకపోలేదని సంస్థ పేర్కొంది.
click me!