డెల్టాను రీప్లేస్ చేసిన ఒమిక్రాన్.. ఆసుపత్రులకు చీకటి రోజులు రానున్నాయని నిపుణుల హెచ్చరిక

By Sumanth KanukulaFirst Published Jan 13, 2022, 4:07 PM IST
Highlights

ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) అమెరికాపై పంజా విసురుతుంది. గత కొద్ది రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఒమిక్రాన్ వేరియంట్.. అమెరికాలో డెల్టా వేరియంట్‌ను పూర్తిగా తొలగించిందని నిపుణులు చెబుతున్నారు.
 


కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) గతంలో వచ్చిన అన్ని వేరియంట్ల కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ అమెరికాపై పంజా విసురుతుంది. గత కొద్ది రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఒమిక్రాన్ వేరియంట్.. అమెరికాలో డెల్టా వేరియంట్‌ను పూర్తిగా తొలగించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే తేలికపాటి లక్షణాలు కలిగిన ఒమిక్రాన్.. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను మాత్రం తగ్గించలేకపోయిందని వారు అంటున్నారు.  అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందంటున్నారు. 

అమెరికాలో నమోదవుతున్న కోవిడ్ కేసులలో 98 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కారణమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్  డైరెక్టర్ రోచెల్ వాలెన్స్‌కీ మంగళవారం తెలిపారు. ఇవి జనవరి 8వ తేదీతో ముగిసిన వారానికి సంబంధించిన డేటా ఆధారంగా చేసుకున్న చెబుతున్న గణంకాలు అని చెప్పారు. రెండు వారాల క్రితం ఒమిక్రాన్ 71.3 శాతం కేసులను నమోదు చేసిందని.. ఆ తర్వాత చాలా గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుందని తెలిపారు. 

అధిక ప్రసారత కలిగి ఒమిక్రాన్.. వ్యాక్సి‌నేషన్ ద్వారా, డెల్టా వేరియంట్ సమయంలో వచ్చిన రోగ నిరోధక శక్తిని అధిగమించి మరీ వ్యాప్తి చెందుతుంది. అయితే చాలా మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని చాపెల్ హిల్‌లోని  University of North Carolinaలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డేవిడ్ వోల్ చెప్పారు

అదే సమయంలో టీకాలు వేయించుకునివారికి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి.. కరోనాలోని ఏ వేరియంట్ సోకిన అది ఆందోళన కలిగిస్తుందని నిపుణలు చెబుతున్నారు. అమెరికాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఇప్పటికే పూర్తి పరిమితితో పనిచేస్తుందని.. ప్రస్తుతం ఉన్న డేటా చూస్తే మున్ముంద చీకటి రోజులు ఎదురయ్యే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. 

ఇక, కోవిడ్ రోగులు విపరీతంగా పెరగడంతో అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలుతోందని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌‌కు చెందిన ప్రొఫెసర్ Neil Sehgal చెప్పారు. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే పరిస్థితా..? కాదా..? అని తాను ప్రశ్నించడం ప్రారంభించినట్టుగా తెలిపారు. 

ఇక, తాజా గణంకాల ప్రకారం అమెరికాలోని ప్రతి ప్రాంతంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ పూర్తి ఆధిపత్యం చేలాయిస్తుందని అక్కడి సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో కరోనా వేరియంట్‌లు విజృంభణ సమయంలో నమోదైన రికార్డులను ప్రస్తుతం నమోదవుతున్న కేసులు అధిగమిస్తున్నాయి. మరోవైపు ఆస్పత్రులలో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ  సంఖ్య రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, సోమవారం కొలొరాడో, ఒరిగాన్‌‌,లూసియానా, మేరీల్యాండ్‌, వర్జీనియాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రజలు కోవిడ్ నిబంధనలను మెరుగ్గా పాటించాలని నిపుణులు కోరుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని కాపాడుకోవడం చాలా కీలకమని సెహగల్ చెప్పారు. 

click me!