చాక్లెట్ ప్లాంట్ లో సాల్మొనెల్లా కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలో ఉత్పత్తి నిలిపివేత...

By SumaBala BukkaFirst Published Jul 1, 2022, 6:49 AM IST
Highlights

చాక్లెట్ తింటున్నారా? అయితే కాస్త ఆలోచించండి.. అది జూన్ 25కు ముందు తయారు చేసిందయితే ఫరవాలేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్ లో సాల్మొనెల్లా కలకలం సృష్టించింది. 

బ్రసెల్స్ :  బ్రస్సెల్స్ లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీలో ‘ సాల్మొనెల్లా బ్యాక్టీరియా’ వెలుగులోకి వచ్చి కలకలం రేగింది.  బారీ కాలెబాట్ గ్రూపు నిర్వహణలో బెల్జియంలోని వైజ్ నగరంలో  ఉన్న కంపెనీ..  గురువారం జూన్ 30న ఈ విషయాన్నివెల్లడించింది. ఈ కంపెనీ లిక్విడ్ చాక్లెట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కర్మాగారంలో తరవాతి నోటీసులు వెలువడే వరకు చాక్లెట్ తయారీ నిలిపి వేస్తున్నట్లు  కంపెనీ ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.  మరోవైపు,  ముందు జాగ్రత్తగా ఇక్కడ తయారు చేసిన అన్నిరకాల ఉత్పత్తులను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. దక్షిణ బెల్జియం  ఆర్లోస్ లోని  ఫెర్రెరో ఫ్యాక్టరీలో లో ఇదే తరహా సాల్మోనెల్లా కేసు ఒకటి బయటపడింది. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే ఇప్పుడు బ్రస్సెల్స్ లో ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం.

బెల్జియంలోని ఈ ప్లాంట్ నుంచి 70కి పైగా  కంపెనీలకు కోకో, చాక్లెట్ ఉత్పత్తులు సరఫరా అవుతాయి. వాటిలో హెర్షే, మోండెలెజ్, నెస్లే వంటి  మిగతా దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే…  ఇక్కడి నుంచి చాక్లెట్ను డెలివరీ తీసుకున్న సంస్థలను కంపెనీ సంప్రదిస్తోంది. జూన్ 25 నుంచి ఈ లిక్విడ్ చాక్లెట్ ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తులను రవాణా చేయొద్దని కోరింది. నిజానికి,  చాలావరకు ఉత్పత్తులు ఇంకా డెలివరీ కాలేదని పరిశ్రమలోనే ఉన్నాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇంకోవైపు, బెల్జియం ఆహార భద్రతా ఏజెన్సీ ‘ఏఎఫ్ఎస్ సీ ఏ’కూడా ఈ వ్యవహారం మీద దర్యాప్తు ప్రారంభించింది.

Medical Assistance to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు భార‌త్ వైద్య సహాయం.. ఆరు టన్నుల వైద్య‌సామాగ్రి పంపిణీ

ఇదిలా ఉండగా..  ‘బారీ కాలెబాట్’ లిక్విడ్ చాక్లెట్ ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే నెంబర్వన్ సంస్థ.  2020- 21 ఆర్థిక సంవత్సరంలో  ఈ సంస్థ 2.2 మిలియన్ టన్నుల ఉత్పత్తులను విక్రయించింది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 60కి పైగా ఉత్పత్తి కేంద్రాలు,  అందులో 13 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇదిలా ఉంటే,  సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో ‘సాల్మోనెలోసిస్’ వ్యాధి  ప్రబలుతుంది. ఇది సోకినవారిలో అతిసారం, జ్వరం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో కూడా వ్యాధి తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘సాల్మోనెల్లా  టైఫీ’ రకం  బ్యాక్టీరియాతో టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం ఉంది. 

click me!