Taliban: అఫ్ఘాన్‌లో తిరుగుబాటుదారుల సమాంతర ప్రభుత్వం..! ‘తాలిబాన్లది అక్రమ సర్కారు’

By telugu teamFirst Published Sep 8, 2021, 5:33 PM IST
Highlights

తాలిబాన్ల ప్రభుత్వానికి సమాంతరంగా తాము ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పంజ్‌షిర్ తిరుగుబాటుదారులు వెల్లడించారు. తాలిబాన్ల ప్రభుత్వం అక్రమమైనదని, అది ప్రజావ్యతిరేకమైనదని పేర్కొంటూ తాము ప్రజల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అహ్మద్ మసూద్ తెలిపినట్టు కొన్ని కథనాలు వెల్లడించాయి.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ప్రకటించుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు రాజీపడటం లేదు. పంజ్‌షిర్‌ లోయను స్వాధీనం చేసుకున్నామని పలుసార్లు తాలిబాన్లు ప్రకటించినప్పటికీ ఖండిస్తూ వచ్చారు. తాజాగా, తాలిబాన్ల ప్రభుత్వమే చట్టవిరుద్ధమని, దాని తీరు చూస్తేనే అది ప్రజావ్యతిరేకమైనదని తేటతెల్లమవుతుందని వ్యాఖ్యానించారు. అంతేనా.. తాలిబాన్ల ప్రభుత్వానికి సమాంతరంగా తామూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజల ద్వారా ఓట్లు పొంది తమ ప్రభుత్వ ఏర్పడుతుందని వివరించారు. తద్వార అంతర్జాతీయ గుర్తింపునూ పొందుతామని తెలిపారు.

తిరుగుబాటుదారుల నాయకుడు అహ్మద్ మసూద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ‘తిరుగుబాటుదారుల ఫ్రంట్ ఓ తాత్కాలిక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చింది. ప్రజల ద్వారా ఓటు వేయించి చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తద్వారా అంతర్జాతీయ సమాజానికి ఆమోదాన్ని సంపాదిస్తాం’ అని వివరించారు.

తాలిబాన్లది అక్రమ ప్రభుత్వమని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలపైనే కక్ష కడుతున్నట్టు ఆ ప్రభుత్వాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ ప్రభుత్వంతో ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత ఏర్పడే ముప్ప ఉందని అంతేకాదు, ఇతర ప్రాంతాలు, ప్రపంచదేశాలన్నింటికీ ఈ ప్రమాదం ఉంటుందని, రక్షణ కూడా కరవవుతుందని హెచ్చరించారు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తాలిబాన్‌లపై పోరాటానికి సంకల్పించాలని అహ్మద్ మసూద్ అంతకు ముందటి ఓ వాయిస్ క్లిప్‌లో పిలుపునిచ్చినట్టు కథనాలు వచ్చాయి. 

ఐక్యరాజ్య సమితి, యూఎన్ మానవ హక్కుల మండలి, యూరోపియన్ యూనియన్, షాంఘై ఆర్గనైజేషన్, సార్క్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌లు తాలిబాన్ ప్రభుత్వానికి కోఆపరేట్ చేయవద్దని తిరుగుబాటుదారులు కోరారు. తాలిబాన్లు ప్రభుత్వాన్ని ప్రకటించిన తర్వాత ఈ తిరుగుబాటుదారులు ఈ వైఖరిని వెల్లడించడం గమనార్హం.

click me!