కరోనాపై చైనా కుట్ర బయటపడింది : నివేదికలో షాకింగ్ విషయాలు...

By AN TeluguFirst Published Dec 21, 2020, 2:01 PM IST
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ ప్రపంచదేశాలన్నీ ఆ దేశంపై  ఆగ్రహంతో ఉన్నాయి. అంతేకాదు ఈ వైరస్ కు సంబంధించిన విషయాల్ని బైటికి రాకుండా మొదట్లో డ్రాగన్ తొక్కి పెట్టిందని.. అందువల్లే వైరస్ విజృంభించిందని ఆరోపించాయి. ప్రపంచదేశాల ఆరోపణలు నిజమేనని తేల్చే ఓ నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ ప్రపంచదేశాలన్నీ ఆ దేశంపై  ఆగ్రహంతో ఉన్నాయి. అంతేకాదు ఈ వైరస్ కు సంబంధించిన విషయాల్ని బైటికి రాకుండా మొదట్లో డ్రాగన్ తొక్కి పెట్టిందని.. అందువల్లే వైరస్ విజృంభించిందని ఆరోపించాయి. ప్రపంచదేశాల ఆరోపణలు నిజమేనని తేల్చే ఓ నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. 

వైరస్ వ్యాప్తి.. దాని పరిణామాలపై సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం ఉండొద్దని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం కొంతమంది నిపుణులు, కొన్ని సంస్థలను నియమించి వారికి భారీ మొత్తంలో చెల్లించినట్లు తెలిసింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలను సంపాదించిన న్యూయార్క్ టైమ్స్, ప్రోపబ్లికా మీడియా సంస్థలు వాటిలోని సారాంశాన్ని ప్రచురించాయి. 

ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి సమాచారం ట్రెండింగ్ లో ఉండకుండా నియంత్రించాలి. అందులో భాగంగానే చైనీయులు హీరోగా పిలుచుకున్న డాక్టర్ లీ వెన్ లియాంగ్ మరణవార్తను కూడా బైటికి పొక్కకుండా ప్రయత్నించింది. 

కరోనా వైరస్ ను మొదటిసారి గుర్తించింది ఈయనే. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన సోషల్ మీడియాలో తన మిత్రులతో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కేసులు పెట్టారు. చివరికి ఆయన చెప్పిన విషయాలు నిజమేనని తేలడంతో వదిలిపెట్టక తప్పలేదు. 

విషాదం ఏంటంటే ఆయన గుర్తించిన కరోనానే ఆయనను పొట్టన బెట్టుకుంది. ఆ సమయంలో చైనావ్యాప్తంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అప్రమత్తమైన షీ జిన్ పింగ్ సర్కార్ వెన్ లియాంగ్ మరణానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం ట్రెండ్ కావొద్దని ఆదేశించింది.

కరోనాను ఎదుర్కొనే క్రమంలో విదేశాల నుంచి అందిన సహాయానికి సంబంధించిన సమాచారం సైతం బయటకు రావొద్దని సీసీపీ ఆదేశించింది. తద్వారా ఇతర దేశాల నుంచి అందే వైద్య సామగ్రి, ఔషధాలపై ఎలాంటి ప్రభావం ఉండదని భావించింది. 

అంటే ఇతర దేశాలు అప్రమత్తమైతే తమకు ఎలాంటి సహకారం అందకపోవచ్చునని చైనా ఆలోచించింది. చైనా ప్రజలు ఎలాంటి సమాచారాన్ని చూస్తున్నారో తెలుసుకునేందుకు ప్రతి ప్రభుత్వ విభాగంలో రకరకాల సాఫ్ట్ వేర్లు ఉన్నట్లు తెలిసింది. తద్వారా ప్రజలకు రుచించే విధంగానే సమాచారాన్ని చేరవేయాలని సూచించింది. 

అంతేకాదు సీసీపీ విధానాలను వ్యతిరేకంగా ఉన్న వార్తల్ని, సమాచారాన్ని భారీ ఎత్తున నియంత్రించాలని చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన యంత్రాంగాన్ని ఆదేశించింది. వీటిలో కొన్ని వార్తా సంస్థలు కూడా ఉండడం గమనార్హం. 
 

click me!