
కరోనా వైరస్ ప్రపంచదేశాలకు గజగజ వణికించింది. ఈ వైరస్ బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ చైనాలోని వ్యుహాన్ ల్యాబ్ నుంచి బయటకు లీక్ అయిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ వాదనలను చైనా తోసిపుచ్చుతుంది. అయితే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పరిశోధకులు చావో షాన్ కరోనా వైరస్‌కు సంబంధించి ఆశ్చర్యకరమైన వాదనలు చేశారు. మనుషులకు సోకేందుకు చైనా ఉద్దేశపూర్వకంగా కరోనావైరస్‌ను ‘‘బయో ఆయుధం’’ రూపొందించిందని పేర్కొన్నారు.
చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) గురించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ప్రత్యేకమైన అంతర్దృష్టులను అందించే ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ జెంగ్‌తో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చావో షాన్ ఈ వాదన చేశారు. మానవులతో సహా వివిధ జాతుల మధ్య వ్యాప్తి చెందడానికి అత్యంత ప్రభావవంతమైన జాతిని గుర్తించే బాధ్యత తనకు, తన సహచరులకు అప్పగించబడిందని చావో చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూను జెన్నిఫర్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు.
జెన్నిఫర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకుడు మిస్టర్ చావో తనతో ఏమి చెప్పారో వివరిస్తుంది. జెన్నిఫర్ తన బ్లాగ్‌లో ఇంటర్వ్యూ 2021 సెప్టెంబర్ లో నిర్వహించబడిందని పేర్కొన్నారు. చావోకి 2019లో నాన్‌జింగ్ సిటీలోని అతని ఉన్నతాధికారి నాలుగు రకాల కరోనా వైరస్‌లను అందించారని.. వాటిలో ఏది అత్యంత వేగంగా వ్యాపించేదో పరీక్షించమని చెప్పారని ఆమె చెప్పింది. చావో.. మానవ ACE2 రిసెప్టర్, గబ్బిలాలు, కోతులపై వైరస్‌ను పరీక్షించారు. చావో.. కరోనా వైరస్‌ను బయో ఆయుధంగా కూడా పేర్కొన్నారు.
ఇక, 2019 వుహాన్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సందర్భంగా తన సహచరులు చాలా మంది తప్పిపోయారని ఆ ఇంటర్వ్యూలో చావో పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆరోగ్యం, పరిశుభ్రత పరిస్థితులను తనిఖీ చేయడానికి వివిధ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు బస చేసిన హోటళ్లకు పంపబడినట్టుగా వారిలో ఒకరు చెప్పారని తెలిపారు. పరిశుభ్రతను తనిఖీ చేయడానికి వైరాలజిస్టులు అవసరం లేదు కాబట్టి.. వైరస్ వ్యాప్తి చెందడానికి వారిని అక్కడికి పంపారని చావో షాన్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే చావో వాదనలపై జెన్నిఫర్ స్పందిస్తూ.. ఇది మొత్తం పజిల్‌లో ఒక చిన్న భాగం మాత్రమే అని అన్నారు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 మిలియన్ల మరణాలకు కరోనా వైరస్ కారణం అయింది. ఈ వైరస్ నిజమైన మూలం ఎక్కడనేది మాత్రం ఇంకా అన్వేషణలో ఉంది.