ఐతే ఆరేళ్ళ క్రితం అనుకున్నదే జరుగుతుందా?

By Siva KodatiFirst Published Oct 11, 2019, 8:38 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన ఐదేళ్ళ తర్వాత, చైనా ఆశిస్తున్న హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యానికి ‘చెక్’ పెట్టడానికి, ఈ ‘అప్ సైడ్ డౌన్’ దృష్టి మళ్ళీ తెరమీదికి వస్తున్న సందర్భం ఇప్పుడిక్కడ కీలకమై కూర్చుంది! ఎలా – భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అద్యక్షుడు క్సీ జిన్ పింగ్ ఈ అక్టోబర్ 11-13 తేదీల్లో తమిళనాడులోని సముద్ర తీర పట్టణం మహాబలిపురంలో కలుస్తున్నారు

-జాన్‌సన్ చోరగుడి

 

దీన్ని ఇక్కడ తెలుగులో బట్టబయలు అనడం కంటే, డిల్లీ లో కూర్చుని ‘ఖుల్లం ఖుల్లా’ అని ఉర్దూలో అనడమే బాగుటుందేమో. ఎందుకంటే విషయం అటువంటిది. నేనీ విషయాన్ని ముందుగా 66 ఏళ్ళ స్వీడన్ జర్నలిస్ట్ – రచయిత బెర్టేల్ లింటర్ పుస్తకంతో మొదలు పెట్టి, ఆ తర్వాత అస్సలు విషయంలోకి వెళతాను. అయినా అతని పుస్తకమే కాదు, దాని సమీక్ష కూడా ఈ శీతాకాల ఆరంభంలో మనకు ఎంతో ఉత్తేజం కలిగించేట్టుగా వుంది.

నిజానికి ఆసియాలో సకాలంలో విడుదల అయిన పుస్తకమది. దాని పేరు – ‘ది కాస్టిలియస్ట్ పెరెల్: చైనాస్ స్ట్రగుల్ ఫర్ ఇండియాస్ వోషన్’. అయితే పుస్తకం పేరులో మనమిప్పుడు అంతగా ఉత్తేజం పొందడానికి గానీ, అందుకు తెలుగును వొదిలి మరీ మన వ్యక్తీకరణకు ఉర్దూను ఆశ్రయించడానికి గానీ ఇందులో ఉన్నది ఏమిటి? అందుకు సమాధానం కోసం, సుహాసిని హైదర్ ఇటీవల చేసిన ఆ పుస్తక సమీక్షా వ్యాసానికి ఆమె పెట్టిన శీర్షిక వద్ద మనం ఆగాలి. 

‘అప్ సైడ్ డౌన్: కౌంటరింగ్ చైనా ఇన్ ది ఇండియన్ వోషన్’ ఇదీ ఆమె శీర్షిక. ఇలా ఇప్పుడు దేశంలో ఏమి జరగాల్సి ఉందో ఆమె చెప్పేసింది. ఏమిటి ఈ ‘అప్ సైడ్ డౌన్’ – తిరగబడాలా, పోనీ తలకిందులు కావాలా, సందర్భం జాగ్రఫీ కనుక ఆఖరి వ్యక్తీకరణగా – పైనున్నది కిందికి కింద ఉన్నది పైకి అంటే - ‘డిల్లీ దక్షణాదికి రావాలి’. ఎందుకు? హిందూ మహా సముద్రంలో చైనా తలపెట్టిన తెంపరితనాన్ని నిలువరించడానికి. అయితే ఈ పుస్తకాన్ని సమీక్షిస్తున్న సుహాసినీ హైదర్ స్ఫూర్తి మన దేశంలో అందరి కంటే ముందుగా పూర్తిగా ఆవాహన చేసుకోవాల్సింది – ఐదేళ్ళ చిన్నదైన ఆంధ్రప్రదేశ్.

అయితే ఆవాహన కాదుకదా, మనం కనీసం దీన్ని అర్ధం కూడా చేసుకోవడం లేదు. బొత్తిగా ‘పట్టించుకోవడం లేదు’ అనడం, నిజానికి ఇక్కడ సరైన వ్యక్తీకరణ. ఇప్పుడు వినడానికి ఇది కొంచెం ‘ఓవర్ టోన్’ అనిపించినా, అస్సలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రయోజనాలు కోసం దీని నుంచి తెలంగాణను వేరు చేసారు అనడం, ఇప్పటి ఈ సమయానికి అది సరైన అవగాహన అవుతుంది. కేంద్రం, దక్కన్ పీఠ భూమిని తీరాంధ్ర నుంచి వేరుచేసి తల బరువును తగ్గించింది.

అలా ఈ దేశ ‘జియో-పొలిటికల్’ అవసరాలకు అది చాలా ముందుగా సమాయత్తం అయింది. ఎలా? రానున్న రోజుల్లో 970 కి.మీ. పొడవున్న ఏ.పి. తీరాన్ని కాపాడడం ఇక్కడ దాని ప్రాధాన్యత. ఆఫ్రికా ఐరోపా దేశాలకు సరకు రవాణాకు హిందూ మహాసముద్రం లోకి దక్షణ చైనా నుంచి దూసుకువచ్చే వాణిజ్య నౌకా యాన కెరటాలను ధీటుగా నిలువరించడం ఇక్కడ మన దేశం తీరప్రాంత సరిహాద్దు భద్రతా అవసరం. 

అయితే, ఇక్కడ అధికారంలోకి వచ్చిన తొలి తెలుగు దేశం ప్రభుత్వం ఆ స్పూర్తిని పట్టుకోవడంలో ఘోరంగా విఫలమయింది. తొలి ఐదేళ్ళు ఎన్.డి .ఏ. ప్రభుత్వానికి చంద్రబాబు ఏ.పి. కేవలం ‘ఎలక్షన్ ఎలయన్స్ పార్టనర్’ స్థాయిని మించి ఎదగలేకపోయింది.

హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాక, అప్పటికే ముప్పై ఐదేళ్ళ చరిత్ర వున్న ఆ ప్రాంతీయ పార్టీ - తన ముందున్న ‘జియో-పొలిటికల్’ సందర్భాన్ని ‘పాన్ ఇండియన్’ దృష్టితో చూడలేక పోయింది. అయితే, ఉత్తర-దక్షణాల మధ్య మారబోతున్న ప్రాధాన్యతా తూకం గురించి 2014 నుంచి కూడా అడపా దడపా ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు. 

‘హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని కావాలి’ వంటి ఆలోచనలు అటువంటివే. రాష్ట్ర విభజన ప్రక్రియ ముగింపు దశకు వస్తున్నది అనుకున్న 2013 చివరి నాటికి హైదరాబాద్ నగరాన్ని ‘నేషనల్ కేపిటల్ టెరిటరీ’ గా ప్రకటిస్తారనే మాటలు కూడా అప్పట్లో వినిపించాయి.

తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన ఐదేళ్ళ తర్వాత, చైనా ఆశిస్తున్న హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యానికి ‘చెక్’ పెట్టడానికి, ఈ ‘అప్ సైడ్ డౌన్’ దృష్టి మళ్ళీ తెరమీదికి వస్తున్న సందర్భం ఇప్పుడిక్కడ కీలకమై కూర్చుంది! ఎలా – భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అద్యక్షుడు క్సీ జిన్ పింగ్ ఈ అక్టోబర్ 11-13 తేదీల్లో తమిళనాడులోని సముద్ర తీర పట్టణం మహాబలిపురంలో కలుస్తున్నారు. చైనా లోని వ్యూహాన్ లో 2017 లో జరిగిన తొలి సౌహార్ధ సమావేశం తర్వాత ఇది రెండవది.

మొదటి నుంచి సముద్ర తీరాలు లేని రాష్ట్రాలు ధిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం మనవద్ద ఉన్నదే. అయితే మొదటి నుంచి సముద్రం కేంద్రంగా అంతర్జాతీయ సంబంధాలు వాణిజ్యం నాగరికత, సాంస్కృతిక ఆదాన ప్రదానాలు కూడా తెలిసినదే. అయితే మన దేశంతో 3,380 కి.మీ. సరిహద్దును పంచుకుంటున్న చైనా వంటి ఆసియా దిగ్గజం, ప్రపంచ అగ్రరాజ్యంగా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న విస్తరణ చర్యలు వాటి పర్యవసానాలు నేరుగా తాకేది తీరప్రాంతమున్న రాష్ట్రాలనే.

పైగా అది హిందూ మహాసముద్రం మీద పైచేయి సాధించడం ద్వారా ఆఫ్రికా ఐరోపా ఖండాల నుండి చమురు ఖనిజాలు తరలించుకోవడానికి, ఆ దేశాల మార్కెట్లను తన ఉత్పత్తులతో ప్రభావితం చేయాలనుకుంటున్నది. రాబోయే రోజుల్లో మనం చూడబోయే ఈ ‘అప్ సైడ్ డౌన్’ పరిణామాలు కీలకం కాబోతున్నది, ఈ పూర్వరంగం నేపధ్యంలోనే.

అయితే, రాష్ట్ర విభజన జరిగిన 2014 నాటి తొలిదినాల్లో తీర ప్రాంత అభివృద్ధి గురించి అప్పటికే ఎంతో ఆశతో ఉన్న సందర్భంలో, కృష్ణా మండలం నుంచి రాజ్యసభ సభ్యుడుగా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడుతో పిచ్చాపాటి మాటల్లో ఉన్నట్టుండి ‘అయినా ఆ నవయుగ కంపెనీ వాడు ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు సార్’ అన్నారు. ఆ విషయం నిజమని తెలియడానికి ఐదేళ్ళు పట్టింది.

కృష్ణపట్టణం పోర్టు నిర్వహణ చూస్తున్న కారణంగా  రామాయపట్టణం పోర్టు ఫైళ్ళలోనే ఆగిపోవడం, బందరు పోర్టు ఖాళీ స్థలంలోనే ఐదేళ్ళు ఆగిపోవడం, ఇవి ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలకు పట్టకపోవడం; ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు పట్ల మన పౌర స్పందన లేమిని పట్టిచ్చే సందర్భాలు. 

అయితే, ఈ ‘అప్ సైడ్ డౌన్’ దక్షణాదికి తెచ్చే కొత్త ‘జియో-పొలిటికల్’ ముఖచిత్రం కోసం, మనం ఇక ‘కాస్మోపాలిటన్’ గా మారడం తప్పదు. ఒక రాజధాని నగరంలో “అద్దెకు ఇల్లు ఇస్తారా?” అని అడిగితే, “మీ కులం ఏమిటి?” అని అడిగే స్థితిలోనే ఎప్పటికీ ఉంటామంటే కుదరదు. అధికారం కోసం పోటీపడుతున్న రెండు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధుల పరిపాలన శైలి, ఈ ఐదేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ కు క్రమక్రమంగా అర్ధమవడం కూడా ఇప్పటికే మొదలయింది.సంయుక్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రెండు కులాలు మొదటి నుంచి ‘ఎంటర్ ప్రెన్యూర్లు’ గా ఉన్నది సత్యం.

ఇప్పటికే ఆ జాగాను అవి పూర్తిగా తమ స్వాధీనంలో ఉంచుకున్నాయి. కొత్తగా ఇదేమీ పైకి మాట్లాడుకోలేనంత అమర్యాదకరమైన విషయము కాదు. కనుక రాష్ట్ర అభివృద్దికి, ఈ ప్రజల ప్రయోజనాలు కోసం, ఈ రెండింటికి ముందుగా ఒక ‘లెవెల్ ప్లే గ్రౌండ్’ వీలైనంత త్వరగా ఏర్పడడం అవసరం. అప్పుడు అది వీరిద్దరి పెట్టుబడులు నుండి ప్రయోజనం పొందుతున్న మిగతా వర్గాలకు అది ప్రయోజనం అవుతుంది. అందుకు అధికారంలో ఉన్నవారే ముందడుగు వేయాల్సివుంటుంది.ఐదేళ్ళ స్పర్ధ ఇంత చిన్న రాష్ట్రానికి అస్సలు అక్కరలేదు. ఇక్కడే ఆగి, ఒకసారి అటు వైపుకు చూస్తే...  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఖాళీ చేసివచ్చిన సచివాలయ భవనాలు, తెలంగాణ సచివాలయ భవనాలను కూడా ప్రధాన నగరం మధ్య వదిలిపెట్టి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరేచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నది ఎందుకు? ముందు ముందు జరగబోతున్న ఏ పరిణామాల కోసం ఈ ముందస్తు సర్దుబాటు లేదా సిద్దబాటు? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు కూడా మున్ముందు ఈ - ‘అప్ సైడ్ డౌన్’ థియరీలో మనం సమాధానాలు వెతుక్కోవల్సివుంటుంది.

click me!