పిల్లలపై ప్రభావం చూపని కరోనా.. కానీ అరుదైన వ్యాధి

By Siva KodatiFirst Published Aug 20, 2020, 6:31 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి ఈ వైరస్ సోకితే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి ఈ వైరస్ సోకితే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా వృద్ధులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కానీ చిన్నారులకు మాత్రం ఇది పెద్దగా హానీ తలపెట్టడం లేదు. చాలా మంది పిల్లలకు కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.

అయితే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు తమ పరిశీలనలో మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేషన్ సిండ్రోమ్ (ఎంఐఎస్-సి)ని గుర్తించారు. ఈ సిండ్రోమ్ బారినపడిన చిన్నారుల్లో గుండె, రక్తనాళాలు, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, మెదడు, చర్మం, కళ్లలో మంటగా ఉంటుంది.

శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఇలా జరుగుతుందట. ఇటీవల ఎంఐఎస్-సికి చికిత్స అందించిన చిన్నారులను పరీక్షించగా, వారు కరోనా పాజిటివ్‌గా తేలింది. లేదంటే అప్పటికే వారిలో కరోనా తగ్గిపోయి యాంటీబాడిస్ డెవలప్ అయ్యాయని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపింది.

ఎంఐఎస్-సి, కవాసకీ డిసీజ్ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కానీ ఐదేళ్ల లోపు చిన్నారులపై కవాసకీ డీసీజ్ ఎక్కువగా ప్రభావం చూపితే, ఎంఐఎస్-సీ ని యువతలోనూ గుర్తించారు. ఎంఐఎస్-సీ అనేది చాలా అరుదైన సమస్య.

కరోనా బారినపడిన చిన్నారుల్లో 5 శాతం కంటే తక్కువగానే ఎంఐఎస్-సీ లక్షణాలు కనిపిస్తున్నాయని ఎయిమ్స్, పీజీఐ ఛండీగడ్ డాక్టర్లు తెలిపారు. న్యూయార్క్‌లో 95, యూకేలో 78 చొప్పున ఎంఐఎస్-సీ కేసులను గుర్తించారు. అమెరికాలో ఇప్పటి వరకూ 570 కేసులను గుర్తించారు.

click me!