
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ.. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో.. ప్రజలను ఆకర్షించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అక్కడి ప్రజలను కరోనా టీకా తీసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 116 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ.840కోట్లు) ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ గేవిన్ న్యూసమ్ గురువారం కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 15 నుంచి కరోనా ఆంక్షలు సడిలించేందుకు సిద్ధమవుతున్న కాలిఫోర్నియా సర్కార్.. రాష్ట్రంలో టీకా తీసుకోని వారిని తిరిగి వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో ఈ భారీ ప్రైజ్ మనీని తీసుకొచ్చింది.
ఇన్నాళ్లు 12 ఏళ్లకు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేసిన ఫలితం లేకుండా పోయింది. 34 మిలియన్ల మంది జనాభా ఉన్న కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 63 శాతం మంది మాత్రమే టీకా తీసున్నారు. మిగిలిన 12 మిలియన్ల మందిని టీకా వైపు ప్రోత్సహించేలా అక్కడి సర్కార్ ఈ ఉపాయం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో లక్కీ డ్రా ద్వారా విజేతలను ప్రకటిస్తారు.
కనీసం ఒక్క డోసు తీసుకున్నవారు ఈ లక్కీ డ్రాకు అర్హులు. జూన్ 4తో ప్రారంభమయ్యే ఈ లక్కీ డ్రాలో పది మందికి 1.5 మిలియన్ డాలర్లు(రూ.10.86కోట్లు), మరో 30 మందికి 50వేల డాలర్లు(రూ.36.21లక్షలు) నగదు బహుమతి అందిస్తారు. అలాగే 20 లక్షల మందికి 50 డాలర్ల(రూ.3,600) గిఫ్ట్ కార్డులు ఇస్తారు. ఇక ఇప్పటికే ఒహియో, కొలరాడో, న్యూయార్క్, ఒరెగాన్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాలు ఇదే మాదిరి టీకాకు తాయిలాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒహియో వ్యాక్స్ ఏ మిలియన్ పేరిట కాంటెస్ట్ నిర్వహిస్తూ విజేతలకు 1 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తోంది. అలాగే కొలరాడో, ఒరెగాన్ కూడా 1 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ ప్రకటించాయి. అటు న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వం తొలి డోసు వేయించుకున్నవారికి ఉచిత బీరు పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఇక న్యూయార్క్ 12 నుంచి 17 ఏళ్ల వయసు గల విద్యార్థులు టీకా తీసుకుంటే లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి స్కాలర్‌షిప్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే.. అమెరికాలో కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకున్న యువతకు డేటింగ్ యాప్స్‌లో ప్రత్యేక ప్రయోజనాలు కల్పించేలా వైట్‌హౌస్ చర్యలు తీసుకుంది.