రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన బస్సు: చైనాలో 21 మంది మృతి

By telugu teamFirst Published Jul 8, 2020, 8:46 AM IST
Highlights

చైనాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు సేఫ్టీ బారియర్స్ ను బ్రేక్ చేస్తూ రిజర్వాయర్ లోకి దైూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా 15 మంది గాయపడ్డారు.

బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు రిజర్వాయర్ లో పడిపోయింది.. దీంతో 21 మంది మృత్యువాత పడగా, 15 మంది గాయపడ్డారు. గుయిజోవ్ ప్రోవిన్స్ లోని అన్షున్ లో మంగళవారంనాడు వంతెనపై నుంచి వెళ్తూ బస్సు రోడ్డు పక్కన ఉన్న బారియర్స్ ను ఢీకొట్టి రిజర్వాయర్ లో పడిపోయింది. 

బస్సులో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోవ్కోవ్ విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్ష రాయడానికి వారు వెళ్తున్నారు. సంఘటనపై విచారణ జరుపుతున్నారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. అతను ఈ మార్గంలో 1997 నుంచి బస్సు నడుపుతున్నాడు. 

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియడం లేదు. అదే విధంగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే విషయంపై కూడా స్పష్టత లేదు. బస్సును మంగళవారం సాయంత్రం నీటిలోంచి తీశారు. 

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 141 మంది ఫైర్ రెస్క్యూ సిబ్బందితో పాటు 19 మంది గజఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పోలీసులు, ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. 

వంతెనపై నుంచి బస్సు మెల్లగా వెళ్తూ అకస్మాత్తుగా ఎడమ పక్కకు తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఆరు లేన్ల డ్యుయెల్ క్యారేజీ వేను దాటి సేఫ్టీ బారియర్స్ ను బ్రేక్ చేసి బస్సు రిజర్వాయరులోకి దూసుకెళ్లింది.

click me!