ఇండియన్ ఫ్యామిలీకి అవమానం.. పిల్లాడు ఏడుస్తున్నాడని విమానంలోంచి దించేశారు

First Published Aug 9, 2018, 12:17 PM IST
Highlights

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ భారతీయ దంపతులను అవమానించింది. పిల్లాడు ఏడుస్తున్నాడని.. వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి ఎగిరిపోయింది. 

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ భారతీయ దంపతులను అవమానించింది. పిల్లాడు ఏడుస్తున్నాడని.. వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి ఎగిరిపోయింది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్‌కు చెందిన ఓ అధికారి తన కుటుంబంతో కలిసి లండన్ ‌నుంచి బెర్లిన్‌కు వెళ్లడానికి బీఏ8495 విమానం ఎక్కారు.. సరిగ్గా ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న సమయంలో వారి మూడేళ్ల చిన్నారికి ఆయన భార్య సీటు బెల్టు పెడుతుండగా.. ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు.

ఎంత చెప్పినా వినిపించుకోలేదు... తోటి ప్రయాణికులు ముద్దు చేసేందుకు ప్రయత్నించినా.. ఎన్ని చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తున్నా బుడ్డొడు ఏడుపు మానలేదు. ఇలాగో విమాన సిబ్బంది చిన్నారి వద్దకు వచ్చి ఏడుపు ఆపకపోతే కిందకు తోసేస్తామని బెదిరించడంతో చంటోడు మరింత బిగ్గరగా ఏడ్చాడు. దీంతో విమాన సిబ్బంది.. ఆ కుటుంబాన్ని.. వారి పక్కనున్న మరికొంతమంది భారతీయులను కిందకు దించేసి ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు.

ఏం చేయాలో తెలియక చివరికి సొంత ఖర్చుతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. తమకు జరిగిన అవమానంపై పౌర విమానయాన మంత్రిత్వశాఖకు ఆ అధికారి లేఖ రాశాడు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. తమపై జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ స్పందించింది.. ఈ తరహా ప్రవర్తన క్షమించదగినది కాదని.. తక్షణమే విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. నేరం రుజువైతే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 

click me!