
న్యూఢిల్లీ: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి మెదడు తినే అమీబా సోకి మరణించాడు. ట్యాప్ వాటర్‌తో తన సైనస్‌ను కడిగే ప్రయత్నం చేశాడు. సైనస్ రిన్స్ చేస్తుండగా ఈ నీటిలోని మెదడు తినే అమీబా అతని మెదడుకు వెళ్లినట్టు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. నెగ్లేరియా ఫోలెరి అనే ఈ మెదడు తినే అమీబా గురించి ఇది వరకే స్థానికులను ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్ ఇచ్చింది.
బ్రెయన్ టిష్యూను నాశనం చేసే మైక్రో ఆర్గనిజం నెగ్లేరియా ఫోలెరి అమీబా చాలా అరుదుగా మనిషి మెదడు వరకు చేరుతుందని, కానీ, ఇది చేరితే మాత్రం ప్రాణాంతకమే అని నిపుణులు చెబుతున్నారు.
నెగ్లేరియా ఫోలెరి సాధారణంగా వేడి నీరు ఉండే నీటి నిల్వల్లో, సరస్సుల్లో, కొలనుల్లో కనిపిస్తుంది. ఆ అమీబా ఉండే నీటితో ముక్కు, సైనస్‌ను శుభ్రం చేసేటప్పుడు ఎక్కువగా ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ముక్కు నుంచి అంతర్గత వాహికల గుండా మెదడును చేరుకుంటుంది. ఆ తర్వాత ఇది అక్కడి కణజాలాన్ని తినేయడం మొదలు పెడుతుంది. ఇలాంటివి జరగడం చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు.
Also Read: కొవిడ్ తరహా లక్షణాలతో దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలివే
ఈ మెదడు తినే అమీబా సోకితే తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మాటలు అస్పష్టంగా మారడం, మెడ దాని దృఢత్వాన్ని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే, మెదడు తినే అమీబా ఉన్న నీటిని తాగితే దాని వల్లే సమస్య ఏమీ ఉండదని హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.