బిల్ గేట్స్ దంపతులు విడిపోతున్నారా..?

By telugu news teamFirst Published May 4, 2021, 7:32 AM IST
Highlights

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న ఈ జంట విడిపోతున్నారనే విషయం తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ మెలిందాగేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్, ఆయన సతీమణి మెలిందా విడిపోతున్నారా..? అవును.. ఈ దంపతులు నిజంగానే విడిపోతున్నారు. వారు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన స్వయంగా ట్విట్టర్ వేడుకగా తెలియజేయడం గమనార్హం.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న ఈ జంట విడిపోతున్నారనే విషయం తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.

‘ ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 27 సంవత్సరాలలో మేము ముగ్గురు అత్యత్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్ లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ భార్యభర్తలుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ట్విట్టర్ లో బిల్ గేట్స్, మెలిందాలు పేర్కొనడం విశేషం.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్ గేట్స్ ఒకరు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 137 బిలియన్ డాలర్లు. 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్- మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు వారు 53 బిలియన్ డాలర్లను సేవా కార్యక్రమాలకు వినియోగించారు.

బిల్ గేట్స్ వయసు 65 సంవత్సరాలు కాగా.. మెలిందా వయసు56. మెక్రోసాఫ్ట్ ను స్థాపించి బిల్ గేట్స్ సీఈవోగా ఉన్న సమయంలో మెలిందా ప్రొడక్ట్ మేనేజర్ గా చేరారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందా కావడం విశేషం. ఆ తర్వాత 1994లో వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

click me!