నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పదేళ్ల జైలు శిక్ష.. ఎందుకో తెలుసా..?

Published : Mar 05, 2023, 02:57 AM IST
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పదేళ్ల జైలు శిక్ష.. ఎందుకో తెలుసా..?

సారాంశం

Minsk: నోబెల్ శాంతి బహుమతి-2022 గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాలియాత్‌స్కీ కి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయ‌న‌కు శిక్ష పడిన తర్వాత ప్రతిపక్షాలు బెలారస్ ప్రభుత్వాన్ని, ఆ దేశ నాయకుడు లుకాషెంకోను టార్గెట్  చేసుకుని విమ‌ర్శ‌ల దాడిచేశాయి.  

Nobel Peace Prize winner Ales Bialiatski: ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, న్యాయ‌వాది,  2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బియాలియాత్‌స్కీ కి ప‌దేండ్ల జైలు శిక్ష‌ప‌డింది. బెలారస్ లోని స్థానిక కోర్టు ఆయ‌న‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు, సంబంధిత చ‌ర్య‌ల‌కు ఆర్థిక సహాయం అందించ‌డం, స్మగ్లింగ్ కు పాల్పడినందుకు బియాలియాత్‌స్కీకి జైలు శిక్ష పడింది. మిన్స్క్లోని లెనిన్ స్కీ జిల్లా  కోర్టు 60 ఏళ్ల బియాలియాత్‌స్కీ కి జైలు శిక్ష‌తో పాటు 65,000 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. 

కాగా, మాన‌వ హ‌క్కుల కోసం పోరాటం సాగించ‌డానికి అలెస్ బియాలియాత్‌స్కీ వియ‌స్నా (Viasna) అనే సంస్థ‌ను స్థాపించారు. ప్ర‌స్తుతం వియ‌స్నా హ్యూమన్ రైట్స్ సెంటర్ కు బియాలియాత్‌స్కీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రాసిక్యూష‌న్ చేసిన వాద‌న‌ల క్ర‌మంలో బియాలియాత్‌స్కీ తో పాటు వియ‌స్నా హ్యూమన్ రైట్స్ సెంటర్ ప్రతినిధులైన‌ వాలెంటైన్ స్టెఫానోవిచ్, వ్లాదిమిర్ లబ్కోవిచ్ ల‌కు కూడా వ‌రుస‌గా  9, 7 సంవ‌త్స‌రాల జైలు శిక్షను న్యాయ‌స్థానం విధించింది.

వివిధ ఆరోప‌ణ‌ల క్ర‌మంలో బియాలియాత్‌స్కీ తో పాటు  వియ‌స్నా సెంటర్ ప్రతినిధులను 2021 జూలైలో  అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 2016 నుండి జూలై 2021 వరకు అలెస్ బియాలియాత్‌స్కీ, ఇతర సభ్యులు లిథువేనియాలో వివిధ సంస్థల నుండి అక్ర‌మంగా నిధులు తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించామ‌ని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. దీని తరువాత ఈ నిధులను చాలా మంది సహాయంతో యురేషియన్ ఎకనామిక్ యూనియన్ సరిహద్దు నుండి పంపించారు. బెలారస్ చట్టాల ప్రకారం ఇది నేరంగా ప‌రిగ‌ణిస్తారు. దీనికి గరిష్ట శిక్ష 12 సంవత్సరాలుగా ఉంటుంద‌ని ప్రాసిక్యూష‌న్ పేర్కొంది.

నోబెల్ బహుమతి గ్రహీత అలెస్ బియాలియాత్‌స్కీ ప‌దేండ్ల జైలు శిక్ష విధించిన త‌ర్వాత ఈ అంశం అంత‌ర్జాతీయంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. అనేక మంది మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు దీనిని ఖండించారు. బియాలియాత్‌స్కీకి శిక్ష పడిన తరువాత, ప్రతిపక్షాలు బెలారస్ ప్రభుత్వాన్ని, దాని నాయకుడు లుకాషెంకోను టార్గెట్  చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బియాలియాత్‌స్కీ  సహా మానవ హక్కుల కార్యకర్తలకు శిక్ష పడిందని ప్రతిపక్ష నేత స్విటలానా ట్వీట్ చేశారు. ఈ విష‌యం మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌ను భయపెడుతోందని పేర్కొన్నారు. అలెస్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేశార‌నీ, అతను బెలారస్ నిజమైన హీరో అంటూ వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో అలెస్ బియాలియాత్‌స్కీ సహా ప‌లువురు మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేయడం, వారికి జైలు శిక్ష విధించ‌డంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టార్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కాగా, మాన‌వ హ‌క్కులు, ప్ర‌జాస్వామ్య హ‌క్కుల కోసం బియాలియాత్‌స్కీ చాలా సంవ‌త్స‌రాలుగా పోరాటం సాగిస్తున్నారు. 1980వ ద‌శ‌కంలో బెలార‌స్‌లో ప్ర‌జాస్వామ్య ఉద్య‌మాన్ని ప్రాంర‌భించిన వారిలో ఒక‌రిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. 2020లో దేశాధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ లుకాషెంకో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్దఎత్తున దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు జ‌రిగాయి. ఈ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో బియాలియాత్‌స్కీ కూడా  అరెస్ట్ అయ్యారు. 2021 జూలై నుంచి ఖైదీలుగా ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క నోబెల్ శాంతి బ‌హుమ‌తి పుర‌స్కారం ల‌భించింది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !