న్యూఢిల్లీ: యూకే ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్.. భారత సంతతి రిషి సునాక్‌కు వ్యతిరేకంగా రహస్య ప్రచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తదుపరి బ్రిటన్ పీఎంగా ఎవరికి మద్దతు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, కానీ, రిషి సునాక్‌కు మాత్రం ఇవ్వొద్దని ప్రచారం చేస్తున్నట్టు శుక్రవారం ఓ మీడియా కథనం వెల్లడించింది.
బోరిస్ జాన్సన్ ప్రధానిగా రాజీనామా చేయాలని సొంత మంత్రులే రాజీనామాలు చేశారు. పార్టీ నుంచీ రాజీనామాల వెల్లువ రావడంతో బోరిస్ జాన్సన్ చివరకు రాజీనామా ప్రకటించక తప్పలేదు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆయన దేశ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.
టోరీ లీడర్షిప్ క్యాండిడేట్లుగా ఓడిపోయినవారినీ.. మాజీ చాన్సిలర్ రిషి సునాక్‌కు మద్దతు ఇవ్వొద్దని కోరినట్టు ది టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడానికి రిషి సునాక్ కుట్ర చేశారని బోరిస్ టీమ్ భావిస్తున్నది. కొన్ని నెలలుగా ఆయన ఈ ప్రణాళిక రచించారని, అనుకున్న ప్లాన్ ప్రకారమే బోరిస్ జాన్సన్‌ను తప్పించడంలో రిషి సునాక్ సఫలం అయ్యారని అనుకుంటున్నది. ఆయన రాజీనామా తర్వాతనే బోరిస్ జాన్సన్‌పై ఒత్తిడి పెరిగిందని భావిస్తున్నది.
తదుపరి పార్టీ నాయకుడిగా తాను ఎవరినీ సమర్థించడం లేదని, ఆ పోటీలో తాను జోక్యం చేసుకోవడం లేదని బోరిస్ జాన్సన్ అన్నారు. తనను ఓడించడంలో విఫలం అయిన నేతలతోనూ ఆయన రహస్యంగా సంభాషణలు చేసినట్టు సమాచారం. రిషి సునాక్ ప్రధాని కావొద్దని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని వారిని కోరినట్టు ఆ కథనం పేర్కొంది.
బోరిస్ జాన్సన్ సన్నిహితులు మద్దతు ఇస్తున్న విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌పైనే ప్రస్తుత ఆపద్ధర్మ ప్రధాని ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. అంతేకాదు, రవాణా శాఖ సహాయ మంత్రి పెన్ని మొర్డాంట్‌నూ పీఎంగా ఎన్నిక కావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఆ కథనం పేర్కొంది. కానీ, రిషి సునాక్ మాత్రం ప్రధాని కావొద్దని బోరిస్ జాన్సన్ భావించినట్టు తెలిసింది.
పీఎం కార్యాలయం ఉన్న డౌనింగ్ స్ట్రీట్ మొత్తం రిషి సునాక్‌ను ద్వేషిస్తున్నదని, కానీ, అది పర్సనల్ అని కొందరి అభిప్రాయాలను ఆ కథనం పేర్కొంది. బోరిస్ జాన్సన్‌ను తప్పించడానికి రిషి సునాక్‌తోపాటు సాజిద్ జావిద్ రాజీనామా కూడా మంట పెట్టిందని, కానీ, వారు రిషి సునాక్‌ను ద్వేషిస్తారని తెలిపింది. బోరిస్ జాన్సన్‌ను పదవీచ్యూతిడిని చేసే ప్లాన్ కొన్ని నెలలుగా సాగిందని వారు భావిస్తున్నారని వివరించింది.