
మయన్మార్‌లోని యాంగోన్‌లోని ఇన్సీన్ జైలులో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. బుధవారం ఉదయం జైలు ప్రవేశ ద్వారం వద్ద రెండు పార్శిల్ బాంబులు పేలాయి. మొత్తం 8 మంది మరణించగా.. అందులో ముగ్గురు జైలు సిబ్బంది, ఐదుగురు సందర్శకులు ఉన్నారు. ఇన్సీన్ జైలు మయన్మార్‌లోనే అతిపెద్ద జైలుగా ఉంది. ఇక్కడ దాదాపు 10,000 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో చాలామంది రాజకీయ ఖైదీలు. అయితే జైలు వద్ద బాంబు పేలుళ్ల ఘటనపై ఇప్పటివరకు ఏ గ్రూప్ కూడా బాధ్యత వహించలేదు.
ఈ ఘటనలో మరో 18 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు చెబుతున్నారు. జైలు పోస్ట్ రూమ్‌లో బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. అయితే అక్కడికి సమీపంలో పేలని ఒక బాంబు ప్లాస్టిక్ సంచిలో కనిపించిందని సమాచారం. ఈ ఘటనలో చనిపోయిన ఐదుగురు సందర్శకులు కూడా మహిళేనని.. వీరు జైలులో ఉన్న ఖైదీలకు బంధువులు అని అధికారులు తెలిపారు.