పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 19 మంది మృతి

By Sumanth KanukulaFirst Published Jul 3, 2022, 3:07 PM IST
Highlights

పాకిస్తాన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో కనీసం 19 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు.

పాకిస్తాన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో కనీసం 19 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని Balochistan ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వివరాలు.. ప్రమాదానికి గురైన బస్సు ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు క్వెట్టా సమీపంలోకి రాగానే డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ఓ మలుపు వద్ద బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదానికి వర్షం కురుస్తూ ఉండటం, బస్సును డ్రైవర్ అతి వేగంతో నడపడమే కారణాలుగా భావిస్తున్నారు. 

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీయడంతో పాటుగా.. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రలకు తరలించారు. ‘‘మేము ఇప్పటివరకు 19 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము, 11 మంది గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది” అని అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ మెహతాబ్ షా తెలిపారు. ఆస్పత్రిలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 

ఈ ప్రమాదంపై బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ ఘోర ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యసహాయం అందించాలని సంబంధిత అధికారులను ప్రధాని ఆదేశించారు.

click me!