
న్యూఢిల్లీ: ఆయనకు 30 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 47 మందికి తండ్రి, బయలాజికల్ తండ్రి. అంటే ఆయన స్పెర్మ్ డోనర్. ఇప్పటి వరకు ఆయన స్పెర్మ్ ద్వారా 47 మంది జన్మించారు. మరో 10 మంది ఈప్రపంచం చూడనున్నారు. స్పెర్మ్ డోనర్‌గా మారాలని ఆ యువకుడు స్వయంగా నిశ్చయించుకున్నాడు. కానీ, ఈ సమస్యాత్మక నిర్ణయంతో ఆయన ఇప్పుడు కొన్ని చిక్కులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఆయనతో డేట్ చేయడానికి మహిళలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. గతంలో కూడా ఆయన డేటింగ్ చేసింది తక్కువే. కానీ, స్పెర్మ్ డోనర్‌గా మారిన తర్వాత ఆయనతో డేటింగ్ చేయడానికి ముందుకు వచ్చిన మహిళలు చాలా తక్కువ. ఒక వేళ వచ్చినా అది చాలా త్వరగానే ముగిసిపోయింది. కానీ, తాను తీసుకున్న నిర్ణయంపై తనకు పశ్చాత్తాపం లేదని అంటున్నాడీ అమెరికాకు చెందిన కైల్ కోర్డీ.
కైల్ కోర్డీ యూఎస్‌లోని కాలిఫోర్నియా నివాసి. స్పెర్మ్ డోనర్‌గా మారక ముందు తన డేటింగ్ లైఫ్ యావరేజీగానే ఉండేదని, లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్స్ ఏమీ లేవని కైల్ వివరించాడు. ఇప్పుడు కూడా తనను చాలా మంది మహిళలు అప్రోచ్ అవుతున్నారని, కానీ, వారంతా కేవలం బేబీ కావాలని అడగటానికి మాత్రమేనని, వారికి నా స్పెర్మ్ మాత్రమే కావాలని అన్నాడు.
తొలుత తాను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పెర్మ్ ఉచితంగా డొనేట్ చేస్తానని అనౌన్స్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత తనకు చాలా మంది నుంచి సిఫార్సులు వచ్చాయని వివరించాడు. తనకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. ఎందుకంటే.. తన దగ్గరకు స్పెర్మ్ కోసం వచ్చిన మహిళల్లో ఎక్కువ మంది సంపన్నులేనని, వారు కావాలనుకుంటే స్పెర్మ్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చని తెలిపాడు. అయినప్పటికీ తన స్పెర్మ్ తీసుకోవడం సంతోషంగా ఉండేదని వివరించాడు. స్పెర్మ్ బ్యాంక్‌లో నుంచి స్పెర్మ్ తీసుకుంటే వారి బయలాజికల్ ఫాదర్‌ను ఆ మహిళలు చూడలేరు. కానీ, తన దగ్గర నుంచి స్పెర్మ్ తీసుకుంటే.. బయలాజికల్ ఫాదర్‌ను చూడవచ్చని, అందుకే తన స్పెర్మ్ కావాలని కోరినట్టు వారు చెప్పారని తెలిపాడు. ఇప్పటికీ తనకు తన స్పెర్మ్ ద్వారా పుట్టిన పిల్లల ఫొటోలు కుప్పలుగా వస్తుంటాయని, వారంతా సంతోషంగా ఉన్నారనే విషయం తనను సంతోషంగా ఉంచుతుందని అన్నాడు.
ఇలా స్పెర్మ్ డోనేట్ చేయడం వల్ల చాలా మంది యువతులు తనతో డేటింగ్ చేయడానికి ఇష్టపడటం లేదని, కానీ, తనను తనలాగే ఇష్టపడే మహిళ కోసం వెయిట్ చేస్తున్నారని కైల్ అన్నాడు. అలాంటి అమ్మాయి వస్తే.. తాను స్పెర్మ్ డొనేట్ చేస్తానని ముందుగానే చెప్తానని, ఆ తర్వాత బంధం సాఫీగా సాగిపోతుంది కదా అని వివరించాడు.