తాలిబాన్లు కూడా ట్వీట్ చేస్తున్నారు.. నాపై ఎందుకీ ఆంక్షలు.. కోర్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వాదనలు

By telugu teamFirst Published Oct 3, 2021, 1:31 PM IST
Highlights

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వాదనలు చేశారు. తాలిబాన్లూ ట్వీట్ చేయడానికి ట్విట్టర్ అనుమతిస్తున్నదని, తన ఖాతాను ఎందుకు శాశ్వతంగా నిలిపేసిందని నిలదీశారు. వెంటనే తన ఖాతా పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టును కోరుతూ పిటిషన్ వేశారు.
 

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలని కోర్టులో వాదించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లు కూడా ట్వీట్లు చేస్తున్నారని, తన ఖాతా ఎందుకు శాశ్వతంగా మూసేశారని అన్నారు. వెంటనే తన ఖాతాను పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించాల్సిందిగా కోరారు. ఈ ఏడాది జనవరిలో క్యాపిటల్ హిల్ భవనంపై దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా మూసేస్తూ ఆ సంస్థ ప్రకటించింది. ఇదే నిర్ణయాన్ని ఫేస్‌బుక్, గూగుల్ కూడా అమలు చేశాయి.

జులై నెలలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికలు ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు సహా వాటి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లపై పిటిషన్ వేశారు. తనపై వారి చర్యలు చట్టవిరుద్ధమైనవని ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ వాదించారు. వెంటనే ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యుల ఒత్తిడితోనే తన అకౌంట్‌ను సస్పెండ్ చేశారని ఆరోపించారు.

తాలిబాన్లు రెగ్యులర్‌గా ట్వీట్ చేయడాన్ని ట్విట్టర్ అనుమతిస్తున్నదని, అలాంటి తన ట్విట్టర్ ఖాతాను ఎందుకు నిలిపేసిందని ట్రంప్ వాదించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ తన ట్వీట్‌లలో కొన్నింటిని తప్పుదారి పట్టించే సమాచారాన్ని కలిగి ఉన్నదనీ ట్యాగ్ చేసిందని గుర్తుచేశారు. హింసను ప్రేరేపిస్తున్నారని పేర్కొంటూ తమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ట్విట్టర్ ఆరోపించినట్టు చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం తన ఓటమిని ట్రంప్ అంగీకరించలేదు. తర్వాత జో బైడెన్ ప్రమాణం చేయనున్న క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ అనుకూలరులు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిలిపేసింది.

click me!