
న్యూఢిల్లీ: లోన్లీనెస్ గురించి హాలీవుడ్‌లో ఫేమస్ చిత్రాలు ఉన్నాయి. లోన్లీనెస్ ఎంతటి వేధనను కలిగిస్తాయో అవి చక్కగా వివరిస్తాయి. దీనిపై మరెంతో చర్చ జరిగింది. ఇప్పటికీ జరుగుతుంది. కానీ, ఆ అడవి మనిషి అనుభవించిన ఒంటరితనాన్ని చర్చించడం కాదు కదా.. కనీసం ఊహించడమూ కష్టమే. అమెజాన్ అడవుల్లో ఆటవిక తెగకు చెందిన చివరి వ్యక్తి 26 ఏళ్లు ఒంటరిగా కాలాన్ని వెళ్లదీశాడు. తన మనుషులు.. తన తెగ మనుషులు అందరూ కళ్ల ముందే కూలిపోయారు. తాజాగా, ఆ చివరి, ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మనిషి అయిన ఆ వ్యక్తి తనువు చాలించాడు. పశువుల పెంపకం, ఇతర సంపదల కోసం భూ
విస్తరణ కాంక్షతో బయటి వారు చేసిన కుటిల పన్నాగాలకు ఆ తెగ బలైపోయింది. ఆ తెగ పై 1970ల నుంచి దాడి జరుగుతున్నది. కొందరు ఆ తెగకు విషం పెట్టారని (ఐరీష్ మిర్రర్ కథనం ప్రకారం) చెబుతుంటారు. మరికొందరు ఒక ప్రణాళిక ప్రకారమే వారిని నిర్మూలించారని వాదిస్తుంటారు. ఏదైతేనేమీ.. ఇప్పుడు ఆ తెగ నామరూపాలు లేకుండా పోయింది. కానీ, ఆ తెగ గురించి, వారు మాట్లాడిన భాష గురించి, వారి వివరాల గురించి ఎవరికీ తెలియదు. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయిన రహస్యాలుగా మిగిలిపోయాయి.
అమెజాన్ అడవులు బ్రెజిల్‌లో విస్తరించి ఉన్నాయి. బొలీవియా దేశానికి సరిహద్దులో ఉన్న బ్రెజిల్ రాష్ట్రం రొండోనియా దట్టమైన చెట్లతో కూడి ఉంటుంది. అక్కడి తనారు ఇండీజినియస్ ఏరియాలోనే ఓ తెగ ఉండేది. ది గార్డియన్ కథనం ప్రకారం, వారు బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకోలేదు. బయటి వారిని అక్కడకు రానిచ్చేవారూ కాదు. ఒక్కోసారి బయటి వారు కనిపిస్తే క్రూరంగా ప్రవర్తించేవారు. కానీ, ఇప్పుడు ఆ తెగ పూర్తిగా అంతరించిపోయింది.
పశువుల పెంపకం కోసం భూవిస్తీర్ణ కాంక్షతో కొందరు ఆ తెగను అంతరించే పనికి పూనుకున్నట్టు స్వచ్ఛంద సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ సభ్యులు తెలిపారు. 1970ల్లోనే ఆ తెగలో మెజార్టీ ప్రజలను భూ విస్తీర్ణం కోసం కొందరు చంపేశారు. అందులో కేవలం ఏడుగురు మిగిలినట్టు బీబీసీ కథనం పేర్కొంది. వీరిపై 1996లో అక్రమ మైనింగ్ చేసే వారు దాడి చేశారు. దీంతో ఇందులో కేవలం ఒక్కరే మిగిలారు. ఆ ఒక్కడు సుమారు 26 ఏళ్లు ఒంటిగా జీవిస్తున్నాడు.
ఈ వ్యక్తిని లొన్లియెస్ట్ మ్యాన్‌తోపాటు హోల్ మ్యాన్ అని కూడా పిలిచేవారు. తాను ఒంటరిగా జీవించిన కాలంలో పదుల సంఖ్యలో పెద్ద పెద్ద గుంతలు తవ్వాడు. అవి ఎందుకు తవ్వాడో స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే, వాటిలోపల కొన్ని పదునైన కర్రలు ఏర్పాటు చేయడం ద్వారా బహుశా క్రూర మృగాల కోసం ఏర్పాటు చేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఏమో బయటి మనుషుల నుంచి రక్షణ కోసం కూడా ఇలా చేసి ఉండొచ్చు. అలాగే, కనీసం 50 ఇళ్లు(గడ్డితో కట్టుకున్న గుడిసెలు) ఆయన ఒంటరిగా కట్టుకున్నాడు. అంటే ఎక్కడా స్థిరంగా లేడు. ఇల్లు కట్టుకుంటూ మారేవాడు. ఇళ్లల్లోనూ పెద్ద గుంతలు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ గుంతలు తాను తలదాచుకుని ఉండటానికి తవ్వుకుని ఉంటాడని పేర్కొంటున్నారు.
బ్రెజిల్ ఇండిజీనస్ ఎఫేర్స్ ఏజెన్సీ ఫునయ్ సభ్యులు.. చివరి సారి ఆయనను 2018లో ఓ చెట్టుకు నరుకుతుండగా చూశారు. గొడ్డలిని పోలిన అస్త్రంతో ఆయన చెట్టును నరికాడు. ఆ తర్వాత కనిపించలేదు. అయితే, ఆ ఏరియాలో కొత్తగా పెద్ద గొయ్యిలు కనిపించడం చూసి ఒకరు జీవించే ఉన్నారని బ్రెజిల్‌కు చెందిన ఫునయ్ సంస్థ సభ్యులు భావించారు. ఆయన రక్షణ కోసం వారు తరుచూ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉండేవారు.
ఆగస్టు 23న తన గుడిసెకు సమీపంలోని ఓ చెట్టుకు కట్టుకున్న ఉయ్యాలలో ఆ చివరి వ్యక్తి మృతదేహాన్ని వారు గుర్తించారు. చుట్టూ ప్రకాశవంతమైన ఈకలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి పెనుగులాట, లేదా హింస జరిగిన ఆనవాళ్లు లేవు. వీటి ద్వారా ఆ తెగ చిట్ట చివరి మనిషి.. తాను కూడా మరణించబోతున్నట్టు ముందుగానే అంచనాకు వచ్చి ఉంటాడని వారు వివరించారు. అందుకే వారి తెగ ప్రకారం, శవం చుట్టూ ఈకలు ముందుగానే పెట్టుకున్నాడు. ఆగస్టు 23వ తేదీకి సుమారు 40 నుంచి 50 రోజుల ముందే ఆ ఒంటరి వ్యక్తి మరణించి ఉంటాడని బీబీసీ కథనం తెలిపింది.
ఆ వ్యక్తికి పోస్టుమార్టం చేయనున్నారు. అంతిమ క్రియలు కూడా బ్రెజిల్ అధికారులు నిర్వహించనున్నారు.