ఇజ్రాయెల్, పాలస్తినా యుద్దంలో మరో హృదయవిధారక సంఘటన చోటుచేసుకుంది. పాలస్తినా శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్, పాలస్తినా మధ్య జరుగుతున్న యుద్దంలో సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది నిరాశ్రయులుగా మారారు. ఇలా ఇల్లూవాకిలి వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చాలామంది వలసబాట పట్టారు. ఇలా పాలస్తినా శరణార్థుల భారీగా ఆశ్రయం పొందుతున్న ప్రాంతమే రఫా. వేలాదిగా శరణార్థుల గుడారాలపై 'ALL EYES ON RAFAH (అందరి చూపు రఫాపైనే)' అని రాసివున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALL EYES ON RAFAH అర్థమేంటి ...
undefined
ఇజ్రాయెల్, పాలస్తినా మధ్య యుద్దానికి ప్రధాన కారణం హమాస్ మిలిటెంట్ గ్రూప్. ఇది పాలస్తినా కేంద్రంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏర్పడిన సంస్థ. ఇది గాజా ప్రాంతంలో బలంగా వుంది. ఈ క్రమంలోనే గాజాను తమ ఆధీనంలోకి తీసుకుంటే హమాస్ పని అయిపోయనట్లేనని భావించిన ఇజ్రాయెల్ ఆ నగరంపై భీకర దాడులు జరుపుతోంది... బాంబుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంగా గాజాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వలసవెళ్ళారు. ఇలా శరణార్థులంతా రఫా ప్రాతంలో భారీగా టెంట్లు వేసుకుని నివాసం వుంటున్నారు. ఇక్కడ దాదాపు 1.4 మిలియన్స్ పాలస్తినా శరణార్థులు తలదాచుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ శరణార్థి శిబిరాల గురించి పాలస్తినాలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ 'ALL EYES ON RAFAH (అందరిచూపు రఫా పైనే) అంటూ కామెంట్ చేసారు. అంటే హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో శరణార్థుల పరిస్థితి గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే అతడు ఈ కామెంట్స్ చేసాడు.
'ALL EYES ON RAFAH ఇప్పుడేందుకు వైరల్ అవుతోందంటే...
ఇజ్రాయెల్ సైనిక దళాలు గత ఆదివారం రఫా ప్రాంతంపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 45 మంది పాలస్తినా పౌరులు ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలోనూ అత్యధికంగా మహిళలు, చిన్నారులే వున్నారు. ఇప్పటివరకు గాజా స్ట్రిప్ లో జరిగిన అత్యంత పాశవికమైన దాడి ఇదే... శరణార్థుల గుడారాలు తగలబడుతున్న దృశ్యాలు, చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు, రక్తమోడుతున్న క్షతగాత్రుల వీడియోలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికన 'ALL EYES ON RAFAH' హ్యాష్ ట్యాగ్ తో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇదికాస్త వైరల్ గా మారింది.
ఇన్స్టాగ్రామ్ లో హ్యాష్ ట్యాగ్ #AllEyesOnRafah తో 1,04,000 పోస్టులు నమోదయ్యాయి. అలాగే మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి భారీగా పోస్టులు పెడుతున్నారు. భారత్ లో కూడా సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈ హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, వరుణ ధావన్ తెలుగు తారలు రష్మిక మందన్నా, సమంతా వంటివారు కూడా రఫాపై జరిగిన దాడిపై స్పందిస్తున్నారు.