
Sri Lanka crisis: శ్రీలంకలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల అక్కడి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కనీసం జీవించడానికి కూడా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో బతుకులు దుర్భరమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక మంత్రివర్గం సమావేశం ఆదివారం అర్థరాత్రి వరకు జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. 26 మంది మంత్రులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి తెలిపారు. అయితే, మహింద రాజపక్సే ప్రధానిగా కొనసాగుతారు.
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయలేదని ఆయన కార్యాలయం ఆదివారం రాత్రి పేర్కొంది. మహింద రాజపక్స రాజీనామా వార్తలను కొట్టి పారేసింది. ఆయనకు అటువంటి ప్రణాళికలే లేవని శ్రీలంక పీఎంవో తేల్చేసింది. మహింద రాజపక్స రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పని పీఎంవో తెలిపింది. ఆ వార్త వెలువడిన కొన్ని గంటల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే కుమారుడు నమల్ రాజపక్సే కూడా తన యువజన, క్రీడల మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఇలా ట్వీట్ చేశారు: "నేను తక్షణమే అమలులోకి వచ్చేలా అన్ని పోర్ట్‌ఫోలియోల నుండి రాజీనామా చేసిన విషయాన్ని అధ్యక్షుడికి తెలియజేసాను, అది ఆయనకు సహాయపడగలదని ఆశిస్తున్నాను. అని తెలిపారు.
ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ఆదివారం ఉదయం పెరదేనియా విశ్వవిద్యాలయం వెలుపల విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వం విధించిన వారాంతపు కర్ఫ్యూను ధిక్కరించిన నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. అలాగే.. రాజధాని కొలంబోలో ప్రతిపక్ష నాయకులు చేపట్టిన మార్చ్‌లో వందలాది మంది ప్రజాలు పాల్గొన్నారు.
సోషల్ మీడియాపై నిషేధం
ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణిచివేసేందుకు శ్రీలంక ప్రభుత్వం శనివారం సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్,రియు యూట్యూబ్‌తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్‌ను బ్లాక్ చేసింది. ఆదివారం మధ్యాహ్నం ప్రధాని కుమారుడు నమల్ రాజపక్సే వ్యతిరేకంగా మాట్లాడటంతో నిషేధాన్ని ఎత్తివేశారు.
శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన 36 గంటల కర్ఫ్యూ సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇంధనం, ఆహారం, ఔషధాల కొరతకు వ్యతిరేకంగా సామూహిక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు కనీసం 664 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.