
Afghan Model: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన సామాన్య ప్రజలతో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. తాలిబాన్ ఆఫ్ఘన్ మోడల్ (Afghan Model), యూట్యూబర్ (you tuber) అజ్మల్ హకికీని తాలిబాన్లు అరెస్ట్ చేశారు. ఇస్లాం మతంతో పాటు ఖురాన్ ను అవమానించారని అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఖురాన్ శ్లోకాలపై అపహాస్యం
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం.. కాబూల్ ఆధారిత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గత వారం తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో..యూట్యూబర్ అజ్మల్ హకికీ తో పాటు ముగ్గురు సహచరులు ఖురాన్ పద్యాలను హాస్యాస్పదంగా ఉపయోగించారని ఆరోపించారు.
ఈ వీడియోలో హకికీ తో పాటు తన సహచరులు హాస్య స్వరంతో అరబిక్‌లో ఖురాన్ పద్యాలను పఠిస్తూ.. నవ్వుతూ కనిపించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. జూన్ 5 న మరొక వీడియోను హకికీ పోస్ట్ చేసాడు. అందులో.. క్షమాపణలు చెప్పాడని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
జూన్ 7న అరెస్టు
ఇస్లామిక్ పవిత్ర విలువలను అవమానించినందుకు జూన్ 7న.. అజ్మల్ హకీకీ తో పాటు తన ముగ్గురు సహచరులను తాలిబాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది. దాని తర్వాత మరొక వీడియో విడుదల చేయబడింది. దీనిలో హకీకీ మరోసారి ఇస్లాంను అవమానించినందుకు క్షమాపణలు కోరుతూ కనిపించాడు.
విడుదల చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్
ప్రస్తుతం.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ (NGO) ఆఫ్ఘన్ మోడల్ అజ్మల్ హకికీ ని, అతని ఇతర సహచరులను విడుదల చేయమని తాలిబాన్‌లను డిమాండ్ చేసింది. దీంతో తాలిబన్లు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పాలనుకునే వారిపై సెన్సార్‌షిప్‌ను ముగించాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పాల్సి వచ్చింది.