కుప్పకూలిన విమానం.. 101 మంది ప్రయాణికులు..

First Published Aug 1, 2018, 12:12 PM IST
Highlights

ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంతితో సహా 101 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. అదృష్టవశాత్తు.. వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు.

101 మంది ప్రయాణికులతో వెళుతున్న మెక్సికో విమానం కుప్పకూలింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంతితో సహా 101 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. అదృష్టవశాత్తు.. వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు.

మంగళవారం దురంగో నుంచి మెక్సికో నగరానికి వెళ్లడానికి బయలుదేరిన ఏరో మెక్సికో విమానంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. విమానం క్రాష్‌ల్యాండ్‌ అవ్వగానే అందులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో భారీ వడగండ్ల వాన పడుతోందని అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే విమానాన్ని దించేశారు.

విమానం మంట్లలో చిక్కుకున్నప్పటికీ అందులోని వారంతా ప్రాణాలతో బయటపడగలిగారు. విమానంలో 97మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మెక్సికో రవాణా శాఖ మంత్రి గెరార్డో రూయీజ్‌ స్పష్టంచేశారు. గాయపడిన వారిలో 49 మందిని ఆస్పత్రిలో చేర్పించామని, మిగతా వారికి చాలా చిన్న గాయాలు కావడంతో వారిని ఇళ్లకు పంపించేశామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానం నుంచి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత విమానం చాలా వరకు మంటల్లో కాలిపోయింది. పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి.

మేము రన్‌వే మీద ఉన్నప్పుడే విజిబులిటీ బాగా తగ్గిపోయిందని విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ 47ఏళ్ల జాక్వెలైన్‌ ఫ్లోరెస్‌ అన్నారు. ఆయన పదహారేళ్ల కూతురు కూడా ఆయనతో విమానంలో ఉన్నారు. ‘విమానం అకస్మాత్తుగా కిందకు రాగా లగేజ్‌ అంతా జారిపోయింది. ల్యాండ్ అవుతుండగానే ఏదో కాలిన వాసన రావడం ప్రారంభించింది. మంటలు కనిపించాయి. నేను వెంటనే సీటు బెల్టు తీశాను. ఇక బయటకు దూకాలని అర్థమైంది. ఇదే విషయం నా కూతురుకు కూడా చెప్పాను. విమానంలో మాకు పక్కనే ఓ రంధ్రం ఉంది. ఇద్దరం అందులో నుంచి దూకేశాం’ అని ఫ్లోరెస్‌ తెలిపారు.
 

click me!