పాక్ ఆర్మీ అదుపులో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు విముక్తి లభించింది. అంతర్జాతీయ ఒత్తిడితో పాటు భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయనను విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.,
పాక్ ఆర్మీ అదుపులో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు విముక్తి లభించింది. అంతర్జాతీయ సమాజంతో పాటు భారత ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో అభినందన్‌ను విడుదల చేయక తప్పని పరిస్థితుల్లో పాక్ ఇరుక్కుంది.
దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ చర్యను శాంతి చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందనడానికి తొలి మెట్టుగా ఇమ్రాన్ అభివర్ణించారు.
వర్ధమాన్ విషయమై భారత ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడేందుకు తాను బుధవారం ప్రయత్నించానని అయితే ఆయన అందుబాటులోకి రాలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమ సమాచారంపై భారతప్రభుత్వంతో పాటు భారతీయులు ఆందోళనగా ఉన్నారు.
పైకి ఏం పర్లేదు అంటున్నా పాక్ ఆర్మీ ఆయనను ఏం చేస్తారోనని గత అనుభవాల దృష్ట్యా భారత్ కంగారుపడుతోంది.
ఈ నేపథ్యంలో తమ నిర్బంధంలో ఉన్న అభినందన్ క్షేమంగా ఉన్నారంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహద్మ్ ఖురేషి ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ వార్త తెలియడంతో ప్రభుత్వంతో పాటు భారత సైన్యం, ప్రజలు హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు.