
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్ నూతన ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు దీపావళి పండుగను సంబురాలు జరుపుకుంటున్న సందర్భంలో సోమవారం ఆయన యూకే పీఎం అయ్యారు. అక్కడ 42 ఏళ్ల నేత (రిషి సునాక్) ప్రధానమంత్రి కావడం 200 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా కీలక పదవుల్లో ఉన్న భారత సంతతి నేతలను ఒక సారి పరిశీలిద్దాం.
కమలా హ్యారీస్:
అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి కమలా హ్యారిస్ బాధ్యతలు చేపట్టారు. భారత్, జమైకాల నుంచి అమెరికా వలస వెళ్లిన దంపతుల కుమార్తెనే కమలా హ్యారిస్.
ప్రవిండ్ జుగ్‌నాథ్:
2017 నుంచి మారిషస్ ప్రధానిగా ప్రవిండ్ జుగ్‌నాథ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన పూర్వీకులు మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. జుగ్‌నాథ్ హిందూ కుటుంబంలో జన్మించారు.
ఆంటోనియో కోస్టా:
2015 నుంచి పోర్చుగల్ ప్రధానిగా సేవలు అందిస్తున్న ఆంటోనియో కోస్టా పోర్చుగీస్, ఇండియన్ పూర్వీకుల వారసుడు.
పృథ్విరాజ్ సింగ్ రూపున్:
పృథ్విరాజ్ సింగ్ రూపున్ మారిషస్‌కు ఏడో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 నుంచి ఈ బాధ్యతల్లో ఉన్నారు. భారత ఆర్య సమాజీ హిందు కుటుంబంలో రూపున్ జన్మించారు.
చాన్ సంతోఖి:
సురీనాం 9వ అధ్యక్షుడిగా భారత సంతతి నేతనే ఉన్నారు. 2020 నుంచి భారత సంతతి చంద్రికాపర్సద్ రాష్ట్రపతిగా బాధ్యతల్లో ఉన్నారు. ఇండో, సూరీనామీస్ హిందూ కుటుంబంలో 1959లో ఈయన జన్మించారు.
మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ:
మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ గుయానా తొమ్మిదో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల్లో ఉన్నారు. ఇండో గుయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈయన 2020 ఆగస్టు 2న ప్రమాణం తీసుకున్నారు.