Ukraine crisis: గన్ను పట్టుకుని శిక్షణ తీసుకుంటున్న 79 ఏళ్ల బామ్మ.. ‘షూట్ చేయడానికి రెడీ’

Published : Feb 16, 2022, 01:46 PM ISTUpdated : Feb 16, 2022, 01:48 PM IST
Ukraine crisis: గన్ను పట్టుకుని శిక్షణ తీసుకుంటున్న 79 ఏళ్ల బామ్మ.. ‘షూట్ చేయడానికి రెడీ’

సారాంశం

ఉక్రెయిన్‌లో యుద్ద మేఘాలు కమ్ముకొచ్చిన తరుణంలో ఆ దేశ పౌరులు మిలిటరీ డ్రిల్స్‌లో పాల్గొంటున్నారు. ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్సెస్ ఆయుధాలకు సంబంధించిన ప్రాథమిక అవగాహనను పౌరుల్లో కల్పిస్తున్నది. ఈ శిక్షణలో 79 ఏళ్ల బామ్మ కూడా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఆమె ఫొటోను ఓ రిపోర్టు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆమెతో మాట్లాడగా.. ఆ బామ్మ తాను షూట్ చేయడానికి రెడీ ఉన్నదని పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: ఐరోపాలో యుద్ధ మేఘాలు(Tensions) కమ్ముకుంటున్నాయి. రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం(War) బద్ధలు కావచ్చని అమెరికా పలుసార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. సుమారు 1 లక్ష ట్రూపులను ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా మోహరించింది. ఉక్రెయిన్ కూడా రష్యాను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నది. నాటో, అమెరికా, ఇతర యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక పరమైన సహకారం అందించడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే కొన్ని వార్‌షిప్‌లు, ఆయుధాలు పంపించాయి. ఇదిలా ఉండగా, రానున్న ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజలనూ అప్రమత్తం చేస్తున్నది.

పౌరులకు యుద్ధానికి సంబంధించి అవగాహన పెంచే పని చేపడుతున్నది. పౌరులకు యుద్ధ విద్యల్లో తేలికపాటి శిక్షణ ఇస్తున్నది. సివిల్ కంబాట్ ట్రైనింగ్ ఇస్తున్నది. గన్నులను అసెంబుల్ చేయడం, డిససెంబుల్ చేయడం, అమ్యునిషన్ లోడ్ చేయడం, లక్ష్యానికి గురిపెట్టడం వంటి వాటిల్లో శిక్షణ ఇస్తున్నది. ఈ శిక్షణలో యువతనే కాదు.. చిన్న పిల్లలు మొదలు.. పండు ముదుసలి వారి వరకు పాల్గొంటుడం ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్స్ ఇస్తున్న ఈ శిక్షణలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని మరియుపోల్‌లో 79 ఏళ్ల బామ్మ వాలెంటినా కాన్‌స్టాంటినోవ్‌స్క్ కూడా పాల్గొన్నారు.

79 ఏళ్ల బామ్మ వాలెంటినా మిలిటరీ డ్రిల్‌లో పాల్గొనడం ఆసక్తిదాయకంగా మారింది. ఆమె ఫొటోనూ ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావిస్తే.. అంతే ఆశ్చర్యకరంగా మాట్లాడారు. తాను తన నగరం, తన కుటుంబం, తన దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. తాను అందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అంతేకానీ, నా నగరాన్ని, నా దేశాన్ని కోల్పోవాలని అనుకోవడం లేదని అన్నారు. అదే సమయంలో తాను దృఢమైన సైనికురాలినేమీ కాకపోవచ్చని చెప్పారు. తాను ఈ శిక్షణ తీసుకున్నప్పటికీ తన దేహం సైనిక చర్యలకు సహకరించకపోవచ్చని తెలిపారు. ఒక వేళ రష్యా దురాక్రమణకు పాల్పడితే ఆ యుద్ధంలో పాల్గొనడానికి తన బాడీ సహకరించకపోవచ్చని పేర్కొన్నారు. ఆయుధాలు తాను మోయలేకుండా ఉన్నానని వివరించారు.

మీరు ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్నారని ఓ రిపోర్టర్ ఆమెతో ప్రస్తావించగా మీ తల్లి కూడా ఈ పని చేస్తారని బదులిచ్చారు. ఈ శిక్షణలో ఎంతో మంది పేరెంట్స్ తమ పిల్లలనూ తీసుకు వెళ్లుతున్నారు. ఒక వేళ యుద్ధ పరిస్థితులే వస్తే.. తమ వారందరికీ అన్నింటిపైనా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పిల్లలను కూడా వెంట తెస్తున్నట్టు తెలిపారు.

అమెరికా కూడా సుమారు 8,500 ట్రూపులను సిద్ధంగా ఉంచింది. నాటో ఇప్పటికే పలు ఆయుధాలను, వార్‌షిప్‌లను ఉక్రెయిన్‌కు తరలించింది. రష్యా సుమారు 1 లక్ష ట్రూపులను మోహరించింది. ఏ క్షణంలోనైనా రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేయవచ్చని అమెరికా వాదిస్తున్నది. కానీ, పశ్చిమ దేశాలు సైన్యాన్ని, యుద్ధ సామగ్రిని ఉక్రెయిన్‌కు పంపి పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయని రష్యా పేర్కొంటున్నది.

రష్యాతో ఇప్పటికే దిగజారిన సంబంధాల దృష్ట్యా అమెరికా, నాటో దేశాలు అక్కడ యుద్ధం చేయాలని భావించడం లేదని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఉక్రెయిన్‌ను తాము దురాక్రమిస్తామన్న వాదనలు కేవలం పశ్చిమ దేశాలవేనని, తమను అప్రతిష్టపాలు చేయాలనేదే వాటి కుట్ర అని రష్యా తెలిపింది. తాము ఉక్రెయిన్‌ను దురాక్రమించబోమని పేర్కొంది. అయితే, కొందరు నిపుణులు మాత్రం రష్యా కొంత విధ్వంసం చేసి.. నాటోతో బేరసారాలు ఆడటానికి తన పట్టును పెంచుకునే ముప్పు ఉన్నదని చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?