సుసంపన్న చరిత్ర, సంస్కృతికి పోలాండ్ నిలయం. ఐరోపాలోని ఈ దేశంలో ఎన్నో ఆకర్షణీయమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్ నుంచి పురాతనమైన ఉప్పు గని వరకు పోలాండ్‌లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
Poland Amazing Facts: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్‌కు చేరుకున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఐరోపా దేశమైన పోలాండ్‌తో ముడిపడి ఉన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
1- ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్
పోలాండ్‌లోని మాల్‌బోర్క్‌లో ఉన్న 'మాల్‌బోర్క్ కాజిల్' విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్దది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ప్యాలెస్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ ప్యాలెస్ 52 ఎకరాలు అంటే దాదాపు 21 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
2- ప్రపంచంలోనే అతి పురాతన ఉప్పుగని
ప్రపంచంలోనే అతి పురాతన ఉప్పు గని వియలిజ్కా (Wieliczka Salt Mine) పోలాండ్‌లో ఉంది. దీని చరిత్ర దాదాపు 800 ఏళ్లు. ఈ గని భూమిలో 135 మీటర్ల అంటే 440 అడుగుల లోతులో ఉంది.
3- పోలాండ్‌లో తయారైన వోడ్కా
వోడ్కా తొలుత పోలాండ్‌లోనే తయారైందని చెబుతారు. అయితే, వోడ్కా తమ దేశంలోనే తయారైందని రష్యా వాదన. వందల ఏళ్ల క్రితం పోలాండ్‌లో వోడ్కాను ఔషధంగా ఉపయోగించేవారు. నేటికీ పోలిష్ ప్రజలు ప్రపంచంలో దాదాపు 260 మిలియన్ లీటర్ల వోడ్కాను తయారు చేస్తున్నారు.
4- ఐరోపాలోనే అతి బరువైన జంతువు
ఐరోపాలోనే అతి బరువైన జంతువుగా ఐరోపా బైసన్‌ను పరిగణిస్తారు. ఇవి పోలాండ్‌లోని బయోలోవిజా ప్రైమ్‌వెల్ అడవుల్లో సంచరిస్తుంటాయి. వీటి బరువు 600 కిలోల వరకు ఉంటుంది.
5- ప్రపంచంలోనే తొలి తలకిందులు ఇల్లు
ప్రపంచంలోనే తొలి తలకిందులు ఇల్లు పోలాండ్‌లోని స్జింబార్క్ (Szymbark)లో ఉంది. చెక్కతో తయారు చేసిన ఈ ఇంటిని అడవిలో తలకిందులుగా నిర్మించారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఇంటిలోకి అటకపై ఉన్న కిటికీల ద్వారా ప్రవేశిస్తారు. అనంతరం ఈ అద్భుతమైన ఇంటిని చుట్టి చూడవచ్చు.
6- ప్రపంచంలోనే అతి పురాతన రెస్టారెంట్
పోలాండ్‌లోని 'పివ్‌నికా స్విడ్నికా' (Piwnica Świdnicka) ప్రపంచంలోనే అతి పురాతన రెస్టారెంట్‌గా పేరుగాంచింది. దీనిని 1275లో ప్రారంభించారు. నేటికీ ఇక్కడికి వచ్చే సందర్శకులు రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తుంటారు.
7- పోలాండ్ ప్రజలు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు
పోలాండ్ ప్రజలు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు సగటున 25-27 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. ఐరోపాలోని దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ వయసు.