కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు కొనాలనుకుంటున్నారా? కొంచెం ఆగండి.. మాంద్యం మాటువేసి ఉంది: జెఫ్ బెజోస్ హెచ్చరిక

By Mahesh KFirst Published Nov 20, 2022, 1:54 PM IST
Highlights

ఆర్థిక మాంద్యం మాటు వేసి ఉన్నదని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని వివరించారు. కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌ల కొనుగోళ్లు వాయిదా వేసుకుని చేతిలో డబ్బులు నిలుపుకోవడం మంచిదని తెలిపారు.
 

న్యూఢిల్లీ: అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులు, చిన్న వ్యాపారవేత్తలకు సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆర్థిక మాంద్యం మాటు వేసి ఉన్నదని, అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకోకండి అంటూ సూచన చేశారు. అవసరమైనవాటినే కొనుగోలు చేయండి అని వివరించారు. ఇప్పటికే పలు రంగాల్లో కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయని గుర్తు చేశారు. బిజినెస్ టైకూనే ఈ వ్యాఖ్యలు చేయడంతో చర్చ మొదలైంది.

సీఎన్ఎన్‌తో ఇటీవలే ఆయన మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో వినియోగదారులకు ఆయన సూచనలు చేశారు. వచ్చే నెలల్లో డబ్బును చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలని వివరించారు. అక్కరలేని వాటిని కొనుగోలు చేయవద్దని అన్నారు. ముఖ్యంగా అమెరికా కుటుంబాలు పెద్ద వస్తువులు కొత్త కార్లు, టీవీలు కొనుగోలు చేయడాన్ని వాయిదా వేసుకోవాలని వివరించారు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ మాంద్యం ముంగిట ఉన్నదని పేర్కొన్నారు.

Also Read: ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్న Amazon, త్వరలోనే 10 వేల జాబ్స్ తొలగించే అవకాశం...

కొన్ని సార్లు అంచనాలనూ నమ్ముకోవాల్సిందే అని వివరించారు. కాబట్టి, వ్యాపారులు కఠినమైన రోజులు వస్తున్నాయని, అందుకు తగినట్టుగా సిద్ధం కావాలని సూచనలు చేశారు. అలాగే, వ్యక్తులకూ ఖరీదైన వస్తువులను వాయిదా వేసుకోగలమని భావిస్తే అలా చేయడమే మంచిదని వివరించారు. ఒక వేళ మీరు బిగ్ స్క్రీన్ టీవీ కొనాలనుకుంటన్నారనుకోండి.. కానీ, ఇంకొంత కాలం ఎదురుచూడాలని కూడా అనుకుంటే, మీ డబ్బును మీ చేతిలోనే ఉంచుకోండని చెప్పారు. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను దగ్గరగా చూడండని తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు, ఫ్రిడ్జ్‌లు, ఇతర మరే వస్తువులైనా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయగలమని భావిస్తే కొనుగోళ్లను వాయిదా వేసుకోవడమే ఉత్తమం అని వివరించారు.

ప్రస్తుతం ఎకానమీ సరిగా లేదని జెఫ్ బెజోస్ అన్నారు. చాలా విషయాలు నెమ్మదిస్తున్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాల్లో ఉద్యోగాల కోత చూస్తూనే ఉన్నామని వివరించారు.

కాగా, అదే ఇంటర్వ్యూలో ఆయన సంపదలో సింహ భాగం 124 బిలియన్ డాలర్లు విరాళం ఇస్తానని ప్రకటించారు.

click me!