కొలంబియా జైలులో తొక్కిసలాట, 49మంది ఖైదీలు మృతి.. ఎలా జరిగిందంటే..

By SumaBala BukkaFirst Published Jun 29, 2022, 8:59 AM IST
Highlights

కొలంబియాలో ఓ జైలులో జరిగిన తొక్కిసలాటలో 49మంది ఖైదీలు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

కొలంబియా : Colombiaలో తీవ్ర విషాదం నెలకొంది. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో హింసాత్మక తోపులాట జరిగింది. ఈ ఘటనలో 49 మంది ఖైదీలు మృతి చెందారు. తులువా నగరంలోని జైలులో ఖైదీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో కొందరు పరుపులకు నిప్పంటించారు. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. తీవ్ర భయాందోళనలకు గురైన ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు తీశారు.  పరిస్థితి అదుపుతప్పి తీవ్ర తోపులాట, తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 49 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు  ఇవాన్ దుక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విధానం మీద దర్యాప్తు జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాగా, అమెరికా దేశాల్లోని జైళ్లలో ఇటువంటి ఘటనలు సాధారణమయ్యాయి. ఈక్వెడార్ లో గత ఏడాది ఆరు సార్లు అల్లర్లు జరిగాయి. ఘటనలో పెద్ద స్థాయిలో ఖైదీలు ప్రాణాలు విడిచారు. కొలంబియాలో జైల్లు ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. అక్కడి జైళ్ల సామర్థ్యం 81వేలు కాగా, ప్రస్తుతం దాదాపు 97 వేల మంది ఖైదీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

యేడాది చిన్నారిని కాల్చి చంపిన ఎనిమిదేళ్ల బాలుడు.. తండ్రి అరెస్ట్..

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో నిరుడు నవంబర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. యూపీలోని ఫతేనగర్ సెంట్రల్ జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బంది మీద దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లను జైలులో బంధించారు. నవంబర్ 7న ఉదయం ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి. జైలులో కొంత భాగానికి ఖైదీలు నిప్పంటించారు. జైలు అధికారులపై రాళ్లతో దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లు అఖిలేష్ కుమార్, శైలేష్ కుమార్లు ఖైదీల చెరలో ఇరుక్కున్నారు. 

ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు, జైలు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ గొడవకు కారణం.. సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఖైదీలు ఆగ్రహంతో వీరంగం సృష్టించారు. సందీప్ కుమార్ కు చికిత్స అందించడంలో ఆలస్యం చేశారని, అందుకే అతను మరణించాడని ఖైదీలు ఆరోపిస్తున్నారు. 

ఖైదీల దాడిలో సుమారు 30 మంది పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మేరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సందీప్ హత్య కేసులో జైలులో ఉన్నాడు. జైలులో ఉన్న సందీప్ అనారోగ్యానికి గురి కాగా, అతనికి చికిత్స అందించడంలో ఆలస్యం జరిగిందని ఖైదీలు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకొన్న ఖైదీలు వీరంగం సృష్టించారు.

ఖైదీలు ఇద్దరు డిప్యూటీ జైలర్లను తీవ్రంగా కొట్టారు.ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకొన్న సీఓ ప్రదీప్ సింగ్, ఫతేఘర్ కొత్వాల్, జై ప్రకాష్ పాల్ కొందరు పోలీసులు చేరుకొన్నారు. దీపావళి రోజున సరైన భోజనం కూడా అందడం లేదని ఖైదీలు ఆరోపిస్తున్నారు. దీపావళి రోజున జైలును ఓపెన్ చేయకపోవడంతో తాము ఎవరిని కలవలేకపోయామని ఖైదీలు ఆరోపించారు.

click me!